అంగన్‌వాడీలపై అడుగడుగునా నిర్బంధం..

ఎక్కడికక్కడ అడ్డగింత
జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు
తమ సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగించింది. అంగన్‌వాడీలు మండల కేంద్రాల్లోనూ, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ, టోల్‌ గేట్ల వద్ద వాహనాల్లో వెళ్తున్న వారిని అడ్డుకుని సమీప పోలీస్‌ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని అదిగమించి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు విజయవాడ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూటమి ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీలు జిల్లాలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు.
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
అంగన్‌వాడీ వర్కర్స్‌ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సోమవారం చలో విజయవాడ వెళ్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. ఏలూరు కొత్త బస్టాండ్‌, ఏలూరు రైల్వే స్టేషన్లలో అనేక మందిని నిర్బంధించడంతోపాటు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద బస్సుల్లో విజయవాడ వెళ్తున్న అనేక మంది అంగన్‌వాడీలను బలవంతంగా దించేశారు. దీంతో అంగన్‌వాడీలు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద బైఠాయించి పోలీసుల చర్యలకు నిరసనగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం నుంచి పోలీసులు, ఐసిడిఎస్‌ అధికారులు అంగన్‌వాడీ వర్కర్లకు ఫోన్లు చేసి బెదిరింపులు చేశారని విమర్శించారు. పోలీసులు అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ముఖ్య నాయకులకు ఫోన్‌ చేసి బెదిరించారన్నారు. కైకలూరు రైల్వేస్టేషన్‌, ఏలూరు రైల్వే స్టేషన్లో, చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో 60 మందిని నిర్బంధించారన్నారు. ఏలూరు కొత్త బస్టాండ్‌లో అనేకమంది అంగన్‌వాడీలను పోలీసులు ఆపారని, కలపర్రు టోల్‌గేట్‌ వద్ద ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వందల మంది అంగన్‌వాడీలను నిర్బంధించారన్నారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వరావుపేట బోర్డర్లో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. నిర్బంధాలను అదిగమించి ఏలూరు జిల్లా నుంచి సుమారు రెండు వేల మందికి పైగా అంగన్‌వాడీలు చలో విజయవాడకు తరలివెళ్లారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.చింతలపూడి: కూటమి ప్రభుత్వం చేతకాని తనమని సిపిఎం నాయకులు రామిశెట్టి సత్యనారాయణ అన్నారు. సోమవారం అంగన్‌వాడీలు ప్రభుత్వ నిర్బంధకాండకు వ్యతిరేకంగా, సమ్మె కాలపు హామీలు అమలు చేయాలని చింతలపూడి అంగన్‌వాడీ జెఎసి కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి బోసుబొమ్మ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారాకోకు సిఐటియు, ఎఐటియుసి సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తుర్లపాటి బాబు, రైతు సంఘం నాయకులు కాలేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె.గురవయ్య, సిఐటియు నాయకులు ఆర్‌.ధర్మారావు, హమాలీ నాయకులు శివ, చిన్నారావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.పోలవరం : 42 రోజులు అంగన్‌వాడీలు సుదీర్ఘంగా పోరాడి సాధించిన సమ్మెకాలపు డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి, సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను, సిఐటియు నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ స్థానిక ఏటిగట్టు వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి, సిపిఎం మండల కార్యదర్శి కారం.భాస్కర్‌ మాట్లాడారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అరెస్ట్‌ చేసిన నాయకులు, అంగన్వాడీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు సాయిలక్ష్మి, పద్మ, ఉమా, సత్యవాణి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సముద్రాల సాయికృష్ణ పాల్గొన్నారు.నిడమర్రు : అంగన్‌వాడీలపై ప్రభుత్వం నిర్బంధం కాండ ప్రయోగించడాన్ని సిఐటియు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. అనంతరం నిడమర్రు మెయిన్‌ రోడ్డులో నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడారు. నాగమణి, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, విజయకుమారి, అరుణ, కరుణ కుమారి మాట్లాడారు.జీలుగుమిల్లి : చలో విజయవాడకు మండలంలోని జీలుగుమిల్లి, కామయ్యపాలెం సెక్టార్‌ నుంచి పలువురు కార్యకర్తలు వివిధ వాహనాల్లో తరలివెళ్లారు. చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించడం దుర్మార్గమని సిఐటియు మండల కార్యదర్శి కొండలరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️