రాష్ట్ర సమాచార, గృహానిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ను అభినందించిన మంత్రి
ప్రజాశక్తి – ఏలూరు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూత అందిస్తుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లాస్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మికుల భద్రతపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లెంపీ పుట్టా మహేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పరిశ్రమల అభివృద్ధి, విస్తరణకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, ఆ వాతావరణాన్ని సరిదిద్ది, పారిశ్రామికవేత్తల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ఈ సమావేశ ముఖ్యోద్దేశమన్నారు. దీనికి కృషి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను మంత్రి అభినందించారు. సమావేశంలో పారిశ్రామిక వేత్తలు తెలిపిన సమస్యలను సిఎం చంద్రబాబు, పరిశ్రమల శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలు పరిష్కరించాలని తనను కలిసి కోరారన్నారు. పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావ కాశాలు అందించాలని కోరారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని 5 నుండి 3వ కాంటూర్‌కు తగ్గించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, 3వ కాంటూర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిని ‘గ్రీన్‌జోన్’గా ప్రకటించి కాలుష్యరహిత పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి కల్పించే దిశగా స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో వచ్చే సెప్టెంబర్ నుండి ప్రతివారం ‘జాబ్‌మేళా’లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో పథకంలో నిర్దేశించిన సమ యంలో సంబ ంధిత శాఖల ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. రాజధాని అమరావతి సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా అనువైందన్నారు. కైకలూరు ఎంఎల్‌ఎ డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు పడిందన్నారు. చింతలపూడి ఎంఎల్‌ఎ సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల పరిసరాల్లో రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో పనులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం వెనుకబడిన గిరిజన ప్రాంతమని, తమ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి గిరిజనులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. భీమడోలు సమీపంలోని అంబర్‌పేటలోని లిక్సిల్ ఇండియా శానిటరీవేర్ కంపెనీ ప్రతినిధి లోకేష్ మాట్లాడుతూ తమ పరిశ్రమకు వచ్చే దారిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటే తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. స్థానిక ఐటిఐలో సిరామిక్ పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక కోర్సును ప్రవేశపెడితే స్థానికులకు తమ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలకు వీలుంటుందన్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ పరిశ్రమ ప్రతినిధి చౌదరి, ఎస్‌ఆర్ సీడ్స్ ప్రతినిధి వెంకటరావుతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం వసూలు చేస్తున్న ఒక శాతం సెస్‌ను కేవలం పరిశ్రమలో పూర్తి పెట్టుబడిపై కాకుండా, పరిశ్రమలో భవన నిర్మాణాల పెట్టుబడి వరకే పరిమితం చేయాలని సూచించారు. విద్యుత్‌ను నాణ్యతతో అంతరాయం లేకుండా అందించాలని కోరారు. రుద్రా ఇండిస్టీస్ గోపాలకృష్ణారెడ్డి మాటా ్లడుతూ 2022 వరకూ 0.6 శాతం ఉన్న డ్యూటీ ఛార్జీలు నేరుగా ఒక శాతానికి పెంచారని, దానిని తగ్గించాలని కోరారు. సమావేశంలో ఎంఎల్‌ఎలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, డిఆర్‌ఒ డి.పుష్పమణి, ఆర్‌డిఒలు ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, కె.అద్దయ్య, వై.భవానీశంకరి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్.త్రినాధరావు, కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, డిపిఒ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
