పెన్షన్ దారులకు దుప్పట్లు పంపిణీ

Nov 30,2024 13:36 #Eluru district

 సొంత నిధులతో 350 మందికి పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారధి దంపతులు 

ప్రజాశక్తి-ముసునూరు: రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామంలో ఉదయం శనివారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పెన్షన్ మొత్తాన్ని 2 వేల నుండి 3 వేల రూపాయలకు పెంచడానికి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం పడితే తాము 10 రోజుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచామన్నారు. ప్రతీ నెల మొదటి తేదీనే మొత్తం పెన్షనర్ల అందరికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందని, సమయంలో ఇంట్లో లేని వారికి 2వ తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు.
మండలంలో 7874 మందికి గాను రూ.3,30,75,500.కోట్ల గ్రామంలో 759 మందికి రూ. 32,17,000 లక్షలు అందిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు.  1 తేది ఆదివారం కావడంతో ఒకరోజు ముందే భారత దేశంలో 30 తేదిన పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
ప్రజలందరూ కూటమి సభ్యులతో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఆ విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసినప్పడికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వ మాది అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్న 1 తేది ఉదయం 5 గంటలకే వృద్దప్య పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో చింతలపూడి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల త్రాగు సాగునీటి సమస్యను తీరుస్తామని ఇల్లు లేని ప్రతీ నిరుపేదలకు రానున్న 5 ఏళ్లలో పక్కా ఇళ్లు కట్టించే భాద్యత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. పేదవాడికి ఏ సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోచ్చని మధ్యవర్తిత్వం దళారీలకు తావులేదని తెలిపారు. ముసునూరు మండలంలో భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ లతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తానని ముసునూరు మండలంలో భూ సమస్యలు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. వీటి కోసం జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లతో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముసునూరు మండలంలో డ్రైనేజ్, రోడ్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు. టిడిపి నాయకులు గరికి ముక్క నాని, తుమ్మల నాగేశ్వరరావు, మానం వంశీ, మానవ రాంబాబు, మనం ఘంటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️