ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఆపద సమయంలో అందించే సాయం అవసరార్థులకు అత్యంత ఉపయుక్తమని ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి చంటి స్పష్టం చేశారు. నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు సుమారు కోటి రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఏలూరులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 9 మందికి రూ.11 లక్షల 74 వేల 8 వందలు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంఎల్‌ఎ బడేటి చంటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పేదలకు అనారోగ్య పరిస్థితులు మరింత భారం కాకూడదనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వాధినేతలు గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్‌టిఆర్ వైద్యసేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అయితే ఆ సేవల పరిధిలోకి రాని వైద్యసేవలను కూడా పేదలకు అందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలో సుమారు కోటి రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు అందజేసినట్లు ఎంఎల్‌ఎ చంటి తెలిపారు. ఇందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పైల వెంకట్రావు రూ.25 వేలు, బొమ్మన హేమలత రూ.27 వేలు, కూరేటి కనకదుర్గ రూ.50,999, షేక్ రిజ్వాన రూ.3,08,615, తుపాకుల ప్రసాద్ రూ.లక్ష, పాయం లక్ష్మి రూ.4 లక్షలు, బోళ్ల శ్రీనివాస్ రూ.1,07,980, ఉప్పుటూరి వెంకట లక్ష్మి, అంజనాదేవి రూ.55,206, చెన్నకేశవుల మంగాదేవి రూ.లక్ష ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టిడిపి నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ పాల్గొన్నారు. కాగా ఒకపక్క అనారోగ్యంతో, ఇంకోపక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కొండంత ధైర్యాన్నిస్తుందని ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఇందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోన్న ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి చంటికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.