కో-ఆప్షన్ సభ్యులకు మేయర్ నూర్జహాన్ ఆదేశం
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
నగర అభివృద్ధితో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయాలని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఏలూరు నగరపాలక సంస్థలో ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు తమ వ్యక్తిగత కారణాలవల్ల పదవికి ఇటీవల రాజీనామా చేశారు. వారి స్థానంలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం ముగ్గురు అభ్యర్థులు వారి అర్హతను ప్రకటిస్తూ దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై బుధవారం ఏలూరు నగరపాలక సంస్థలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ కొల్లేపల్లి రాజు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మాజీ కార్పొరేటర్ సుమతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూర్జహాన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను మేయర్ పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
