వాల్‌పోస్లరు ఆవిష్కరించిన ఎఐటియుసి, యూనియన్ నాయకులు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్లు ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా కోశాధికారి కె.మల్లేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మహాసభ వాల్‌పోస్టర్‌ను స్థానిక ఎఐటియుసి జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌మీటర్లు తీసుకొస్తున్న కారణంగా విద్యుత్ మీటర్ రీడర్లకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థలోనే విద్యార్హత బట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ ప్రథమ మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మహాసభకు రాష్ట్రంలో పనిచేస్తున్న 4,500 మంది మీటర్ రీడర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 327 మందికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతినిధులు హాజరవుతున్నారని వారు తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏలూరు నగర అధ్యక్షులు కె.శ్రీధర్‌రావు, నాయకులు కె.మురళీబాబు, ఆర్.అప్పలస్వామి, ఎం.సూరిబాబు, ఆర్.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
