పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

‘స్వచ్ఛతా హి సేవ’లో అందరూ భాగస్వాములవ్వాలి
జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ, డిఆర్‌ఒ పుష్పమణి
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని, గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పద్మశ్రీ అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక కొత్త బస్టాండ్‌, జన్మభూమి పార్కుల వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి ప్రతిజ్ఞ చేయించారు. ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ, డిఆర్‌ఒ డి.పుష్పమణి మొక్కలు నాటారు. చీపురు పట్టి రోడ్లపై చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్‌ పర్సన్‌ పద్మశ్రీ మాట్లాడుతూ మహాత్మ గాంధీ కలలుకన్న స్వచ్ఛమైన భారతదేశం, అభివృద్ధిని సాధించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనచుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక అనారోగ్యాలను దూరం పెట్టవచ్చన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇందుకోసం కొంత సమయం కేటాయించాలన్నారు. పచ్చదనం వల్లే పర్యావరణ సమతుల్యత సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కెఎస్‌ఎస్‌.సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, మున్సిపల్‌ కమిషనరు ఎన్‌.భానుప్రతాప్‌, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, ఐసిడిఎస్‌ పీడీ కె.పద్మావతి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌కుమార్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎన్‌.పుష్పలత, సెరీకల్చర్‌ డీడీ డి.వాణి, సెట్‌ వెల్‌ సిఇఒ ప్రభాకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.ముక్కంటి, పశుసంవర్ధక శాఖ జెడి జి.నెహ్రూబాబు, మెప్మా సంఘాల మహిళలు, పలువురు మహిళలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️