ప్రజాశక్తి – ఏలూరు
ఫంగల్ తుపాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు రోజులు వరి కోతలు కోయవద్దని రైతులకు జెసి పి.ధాత్రిరెడ్డి సూచించారు. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో ఆమె శనివారం పర్యటించారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వాతావరణాన్ని గమనిస్తూ వరి పంటను, ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకుంటూ అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే బరకాలు అన్నిటిని రైతులకు అందించాలని అన్ని డిపార్ట్‌మెంట్ అధికారులను అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు వెంటనే ట్రక్ షీట్ జనరేట్ చేసి తక్షణమై ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.భీమడోలు : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు జెసి ధాత్రిరెడ్డి శనివారం భీమడోలు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై ధాన్యం ఆరబెట్టి భద్రపరిచే ఏర్పాట్లలో ఉన్న రైతులతో మాట్లాడారు. ఇతర వివరాలను వ్యవసాయ అధికారి ఉషారాణి జెసి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో రైతులను ఆదుకునే క్రమంలో రైతుల అవసరాలకు సరిపోయే విధంగా టార్పాలిన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరబెట్టిన ధాన్యంలో తేమ శాతం నిర్ణీత ప్రమాణాలకు మించి ఒకటి రెండు శాతం అదనంగా ఉన్నప్పటికీ మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవే వర్షాలు ఆదివారం కూడా కొనసాగితే రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు రామలక్ష్మి, రూపా దేవి, ఫణికుమార్ పాల్గొన్నారు.ఉంగుటూరు : వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు. తుపాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పరిశీలించి పరిష్కరించే ఉద్దేశంతో జెసి ధాత్రిరెడ్డి శనివారం ఉంగుటూరు మండలంలో పలు గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథపట్నంలోని పలువురు రైతులను కలిసి జెసి మాట్లాడారు. రైతులు తమకు దగ్గరలోని రైస్ మిల్లుకు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు. హమాలీలు, రవాణా, రైస్ మిల్లర్లతో ఏదైనా సమస్యలు ఏర్పడితే దగ్గరలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారుల దృష్టికి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004256453కి ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరిస్తారన్నారు. జెసితో పాటు తహశీల్దార్ పూర్ణప్రసాద్, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.