ఎడిఎ నాగ కుమార్
ప్రజాశక్తి – ముదినేపల్లి
రైతులందరూ ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో దుకాణదారుల నుంచి కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని ఇంటర్నల్ స్క్వాడ్ ఇన్‌ఛార్జి, చింతలపూడి ఎడిఎ నాగకుమార్ అన్నారు. ఇంటర్నల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ముదినేపల్లి మండలంలో మంగళవారం ఎరువుల, పురుగుమందుల దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్‌పి ధరలకు మించి ఎరువులు అమ్మినట్లయినా, బిల్లులు ఇవ్వకుండా పురుగుమందులు విక్రయించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సదరు లైసెన్సులు రద్దు చేయడానికి సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. మండలంలోని చిగురుకోట గ్రామంలో దుర్గశ్రీ ట్రేడర్స్‌లో సరైన పత్రాలు లేకుండా అమ్మకానికి ఉంచిన రూ.1,06,886 విలువైన పురుగు మందులను ఈ సందర్భంగా సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.వేణుమాధవ్ పాల్గొన్నారు.