పేలుడు ఘటనలో బాధితులకు ఆర్థికసాయం

ఏలూరు సిటీ : దీపావళి పండుగ రోజు ఏలూరు తూర్పువీధిలో జరిగిన అనుకోని దుర్ఘటనలో గాయాలపాలై బాధితులుగా మారిన ఆరుగురికి టిడిపి అండగా నిలిచిందని ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్‌పేటలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తూర్పువీధి పేలుడు ఘటనలో బాధితులకు పార్టీ ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఎంఎల్‌ఎ అందించారు. బాధితులు గోపిశెట్టి సురేష్‌, కె.సత్యనారాయణ, కురుళ్ల శ్రీనివాస్‌, ఎస్‌కె.ఖాదర్‌, దేవరకోండ సతీష్‌, ఎండీ ఖాన్‌లు కొలుకున్న అనంతరం ఎంఎల్‌ఎ చంటిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ఎంఎల్‌ఎ చంటి అందించారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ దీపావళి రోజు జరిగిన ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఘటనలో గాయాలపాలైన వారికి టిడిపి అండగా నిలిచిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటూ, వారికి ఆర్థిక భరోసాను కూడా ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.20 వేల ఆర్థికసాయం అందించామని, అందులో ఒకరి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించేందుకు కూడా ఆలోచన చేస్తామని ఎంఎల్‌ఎ చంటి భరోసా ఇచ్చారు.

➡️