ప్రజాశక్తి – భీమడోలు
ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని విపత్తులు ఎదురైన సమయంలో ప్రాణాలకు తెగించి ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చేది అగ్నిమాపక శాఖ సిబ్బంది అని, వారి సేవలు అందరికీ ఆదర్శప్రాయమని భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ యలమర్తి రవీంద్రకుమార్ అన్నారు. భీమడోలు ఫైరాఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు సాగే ఈ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రకుమార్ ప్రారంభించారు. వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. విధి నిర్వహణలో అగ్నిమాపక సిబ్బంది వినియోగించే పరికరాలు, వాటి పనితీరు గురించి అసిస్టెంట్ ఫైరాఫీసర్లు ఇమ్మానుయేల్, నాగబాబు వివరించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం శకటంతో విద్యార్థులు, సిబ్బంది భీమడోలు పురవీధులలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైరాఫీసర్ నాగరాజు మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు వివరించారు. గత సంవత్సర కాలంలో కేంద్రం పరిధిలో 50 విజ్ఞప్తులు రాగా, సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల రూ.1.05 కోట్లు విలువైన ఆస్తులను కాపాడామన్నారు. ఈ సంఘటనల్లో సుమారు రూ.34 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఏలూరు, పోలవరం కాలువలతోపాటు ఇతర చోట్ల సుమారు ఆరుగురు నీట మునగ్గా నలుగురిని కాపాడమన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న అగ్నిమాపక శకటం శిథిలమైందని, తాత్కాలిక మరమ్మతులతో దానితోనే కాలం గడుపుతున్నామని తెలిపారు. జులైలో నూతన వాహనం మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. నూతన బోట్లు కూడా రావాల్సి ఉందని తెలిపారు.
