ఎసిబి వలలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆమె సహాయకుడు

రూ.1,09,000 స్వాధీనం
వారి ఇళ్లల్లోనూ సోదాలు : ఎసిబి డిఎస్‌పి
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
నాణ్యతలేని సోడాలు తయారు చేస్తున్న ఊప్స్‌ గోలి సోడా కంపెనీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేసిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను, ఆమె సహాయకుడిని ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వల వేసి పట్టుకుని అరెస్టు చేశారు. ఏలూరు అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు రూరల్‌ ప్రాంతంలో ఊప్స్‌ అనే పేరుతో కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి గోకుల్‌ గోలి సోడా కంపెనీ నిర్వహిస్తున్నాడు. అయితే సాయిగోకుల్‌కు ఏలూరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దొండపూడి కావ్యరెడ్డి, ఆమె సహాయకుడు పుల్లారావులు ఫోన్‌ చేసి గోలి సోడా రసాయనాలు అధికంగా ఉన్నట్లు గుర్తించామని సమాచారం అందించారు. ఇందుకు రూ.25 వేలు లంచంగా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేయగా అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.రెండు వేలుగా ఒప్పందం చేసుకున్నారు. మంగళవారం ఆ నగదును ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకున్నారు. కాని అధికారి ఆమె సహాయకుడు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆ లంచం సొమ్మును కావ్యరెడ్డికి, పుల్లారావుకు గోకుల్‌ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అక్కడ ఉన్న అవినీతి నిరోధక శాఖాధికారులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు వినియోగిస్తున్న కారును కూడా తనిఖీ చేయగా రూ.87 వేలు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.22 వేలు, కారులో రూ.87 వేలు మొత్తం రూ.1,09,000 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఎసిబి డిఎస్‌పి తెలిపారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దాడిలో ఏలూరు అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి వి.సుబ్బరాజు, సిఐలు ఎన్‌.బాలకృష్ణ, కె.శ్రీనివాస్‌, రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ వాసు కృష్ణ పాల్గొన్నారు.

➡️