గజానికో గుంత.. ప్రజల చింత..!

అధ్వానంగా నూజివీడు – ఏలూరు రోడ్డు
2019 ప్రారంభించిన పనులు ముందుకెళ్లని వైనం
ప్రమాదాల బారిన వాహనదారులు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి – ముసునూరు
నూజివీడు నుంచి వయా ముసునూరు, గోపవరం, బలివే, వేల్పుచర్ల గ్రామాల మీదగా వేళ్లే ఆర్‌అండ్‌బి రహదారి గోతులమయంగా తయారైంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సింగల్‌ రోడ్డును రెండు లైన్ల రహదారిగా నిర్మించేందుకు గత ప్రభుత్వం 2019లో రూ.47.20 కోట్ల అంచనా లతో హైదరాబాద్‌కు చెందిన రిత్విక్‌, పృధ్వి కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి అప్పగించింది. అప్పటినుంచి నేటి వరకూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం మరింత గోతులమయంగా తయారై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రారంభ దశలో రోడ్డు పనులు శరవేగంగా చేపట్టారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. నేటివరకు ఆ రోడ్డును ఎవరూ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి కళ్యాణ ఉత్సవాల నిమిత్తం మండలంలోని బలివే గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అయినా నేటికీ ఆ రోడ్డు పనులు మొదలు పెట్టలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బైక్‌పై ప్రయాణించేవారు ప్రమాదాలకు గురైన సంఘటనలు కోకొల్లాలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం కూడా సంభవించింది. అయినా అధికారులు స్పందించడంలేదని, పాలకులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బి శాఖాధికారులు, రాజకీయ నాయకులు రోడ్డు నిర్మించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

➡️