ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి

ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌
జిల్లాలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులను డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని 16 రకాల ప్రభుత్వ భూములు నాలుగు లక్షల ఎకరాలు ఉన్నాయని, ఈ భూములను భూస్వాములు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారన్నారు. వెంటనే ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని ఎర్రకాలువ ప్రాజెక్ట్‌ మిగులు భూములు పంగిడిగూడెం, కేతవరం, గురవాయిగూడెం ల్యాండ్‌ సీలింగ్‌ భూములు, టి.నర్సాపురం మంగళిమెట్ట రావమ్మగూడెం ఏజెన్సీలో గిరిజనులు సాగు చేస్తున్న ఎల్‌టిఆర్‌ పోడు భూములు, దోసపాడు 400 ఎకరాల ల్యాండ్‌ సీలింగ్‌ భూములు ఇలా జిల్లామొత్తంగా భూపోరాటాలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. పోరాట సందర్భంలో పేదలు భూముల్లో సాగు చేసి పంటలు వేయగా రెవెన్యూ అధికారులు భూస్వాములతో కుమ్మక్కై పేదలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం సంఘం పోరాటాల ఫలితంగా వచ్చిందని, ఈ చట్టం అమలులో ఉపాధి హామీ అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రావాల్సిన వేతన బకాయిలు కోట్లాది రూపాయలు ఉండగా విడుదల చేయకుండా అధికారులు మొద్దునిద్ర నటిస్తున్నారని, పేస్లిప్‌లు ఇవ్వకుండా కూలీల డబ్బు అధికారులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. పేదలు పట్టెడు అన్నం తింటున్నారంటే ఈ ఉపాధి హామీ చట్టమే కారణమని గుర్తు చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో చెరువులో ఉపాధి పనుల స్థానంలో జెసిబి యంత్రాలతో రాత్రుళ్లు మట్టి తోలకాలు సాగిస్తున్నారని, ఇంత అన్యాయం జరుగుతుంటే బాధితులపై చర్యలు తీసుకోకుండా ఎంపిడిఒ, ఎపిఒ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అక్రమంగా మట్టి తోలుతున్న భూస్వాములపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీలకు మజ్జిగ, తాగునీరు, టెంట్లు, సమ్మర్‌ అలవెన్స్‌,కనీస సౌకర్యాలు కల్పించాలని, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా 200 రోజులు పనులు చూపి రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, ఉపాధి హామీ అధికారులు సమగ్రంగా పరిశీలించి కూలీలకు, పేదలకు తగిన న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూమి, కూలీ, ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు తామా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, ఆర్‌.డానియేలు, వి.వెంకటేష్‌, ఎస్‌.మహంకాళి, ఎ.ప్రభాకర్‌రావు, వై.సీత, ఎస్‌.కోటేశ్వరరావు, హోలీ మేరీ, కె.దుర్గ, ఎస్‌.సాయికృష్ణ, పిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు.

➡️