ముమ్మరంగా రబీ ధాన్యం మాసూళ్లు
వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన
సరిపడా గోనె సంచులు అందుబాటులో లేని పరిస్థితి
ధాన్యం కొనుగోలు లక్ష్యంలో కోత.. కొనుగోలు చేయకపోతే ఎలా?
ఏలూరు జిల్లాలో 23 వేలు, పశ్చిమలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
48 గంటల్లోపే ధాన్యం సొమ్ము జమతో రైతుల్లో సంతృప్తి
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
వరి రైతులను ధాన్యం టెన్షన్ వెంటాడుతోంది. వాతావరణ మార్పులతో ఈదురుగాలులు, వర్షం కురుస్తుండటంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. మరోపక్క సరిపడా గోనె సంచులు రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడం, ధాన్యం కొనుగోలు లక్ష్యాలు కుదించడం అన్నదాత గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రబీ మాసూళ్లు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రబీలో పశ్చిమలో 2.21 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా దాదాపు 40 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ 30 వేల మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యం కొనుగోళ్లు సాగాయి. ఏలూరు జిల్లాలో 80 వేల ఎకరాల్లో వరి సాగు సాగగా ఇప్పటి వరకూ 15 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము 48 గంటల్లోపే జమ కావడంతో రైతుల్లో సంతృప్తి నెలకొంది. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సాఫీగా సాగడంతో, రబీలోనూ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు సాగుతుందని రైతులు ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం సొమ్ము నెలల తరబడి జమయ్యేది కాదు. దీంతో రైతులు అయినకాడికి దళారులకు అమ్ముకునేవారు. ధాన్యం సొమ్ము ఒకటి, రెండు రోజుల్లోనే జమ కావడంతో రైతులు సైతం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం మాత్రం టార్గెట్లు నిర్ణయించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.ధాన్యం కొనుగోలు టార్గెట్లలో కోత ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ఒకపక్క చెబుతూనే మరోపక్క జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి టార్గెట్లు పెట్టింది. ఏలూరు జిల్లాలో రబీలో 3.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం మాత్రం తొలుత లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తామని చెబుతోంది. దిగుబడిలో సగం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో మిగిలిన లక్షా 97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపారులకు అమ్ముకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కని పరిస్థితి. పశ్చిమగోదావరి జిల్లాలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు టార్గెట్ మాత్రం ఆరు లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చారు. మరి మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేయాలి. అయినకాడికి దళారులకు అమ్ముకోవాల్సిందేనా అనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకుండాపోయింది. ధాన్యం సొమ్ము సకాలంలో ఇచ్చి, మద్దతు ధర వస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకుండా పక్కకు తప్పుకోవాలని చూడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.గోనె సంచుల కొరత ఎదుర్కోవాల్సిందేనా..? గత ప్రభుత్వ హాయాంలో ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో గోనె సంచుల కొరత ఒకటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్‌లో గోనె సంచుల కొరత రాకుండా చూసుకున్నారు. రబీలో మాత్రం గోనె సంచులపై సరైన ప్రణాళిక లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు జిల్లాలో 55 లక్షల వరకూ గోనె సంచులు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు మాత్రం జరగలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మండలానికి అవసరమైన సంచుల్లో నాలుగొంతుల్లో ఒక వంతు సంచులు మాత్రమే రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల సంచులు అవసరం ఉంటే నాలుగు లక్షల సంచులు మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఖరీఫ్‌లో మాత్రం ముందుగానే సరిపడా సంచులను అందుబాటులో ఉంచారు. ఖరీఫ్ కంటే రబీలో దిగుబడి ఎక్కువగా వస్తోంది. సంచుల అవసరం ఎక్కువగా ఉంటుంది. జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా సంచులు మాత్రం సరిపడా లేవని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. వాతావరణ మార్పులతో రైతులు మాసూళ్లు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ధాన్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో సంచుల కొరత రైతులను వెంటాడే పరిస్థితి ఉందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. అదే జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడనుంది. అధికారులు సంచుల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పశ్చిమలో కొంతమేర సంచులు అందుబాటులో ఉన్నప్పటికీ ధాన్యం ముమ్మరంగా వస్తే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందనే ఆందోళన సైతం ఉంది. జిల్లా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పొచ్చు.
