ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఎం.లక్ష్మి
టి.నరసాపురం : పోషణ వాటికల నిర్వహణ ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఎం.లక్ష్మి అన్నారు. మండలంలోని అల్లంచర్ల, రాజుపాలెం, కొత్తగూడెం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం బాలింతలు, గర్భిణులకు ఆకుకూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఆరేళ్ల లోపు చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు బలవర్ధకమైన ఆహారం అందించే క్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూరలతో పాటు కూరగాయలు బెండ, వంగ, చుక్కుడు, టమాటా, బీర మొదలైన కూరగాయలు పండించి పంపిణీ చేస్తున్నామన్నారు. మండలంలో పోషణ వాటికలుగా 12 అంగన్వాడీ కేంద్రాలు ఎంపికయ్యాయని తెలిపారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని 0-6 పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని ఆమె సూచించారు. ఆకుకూరలు, కూరగాయతో రక్తహీనత నివారించవచ్చునని తెలిపారు. కొత్తగూడెం అంగన్వాడీ కార్యకర్త పి.పోసమ్మ పాల్గొన్నారు.