వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ వేదికగా ఐదో పిల్లల సంబరాలు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
హేలాపురి బాలోత్సవం ఐదో పిల్లల సంబరాలు ఈ నెల 23వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం ఛైర్మన్ ఆడుసుమిల్లి నిర్మల, అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు ప్రకటించారు. అన్నే భవనంలో బాలోత్సవం కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన బాలోత్సవం సన్నాహక కార్యక్రమంలో వారు మాట్లాడారు. 2019 నుంచి హేలాపురి బాలోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. హేలాపురి బాలోత్సవానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దల నుంచి అపూర్వమైన స్పందన వస్తోందన్నారు. వట్లూరులో ఉన్న సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో బాలోత్సవం జరుగుతుందన్నారు. 69 అంశాల్లో నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించే వేదికగా బాలోత్సవం కొనసాగుతోందని వివరించారు. 23న ఉదయం పది గంటలకు కరెన్సీ నోట్లు, ఫ్యాన్సీ కాయిన్స్, మోటివేషన్ ఎగ్జిబిషన్‌తో బాలోత్సవ కార్యక్రమాలు ప్రారంభ మవుతాయని తెలిపారు. బాలోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
