ఏలూరులో క్రాఫ్ట్‌ బజార్‌ ప్రారంభం

కేవలం రూ.10 నుంచే హస్త కళలు
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఏలూరులో భారతీయ హస్తకళ ప్రదర్శన క్రాఫ్ట్‌ బజార్‌ ప్రారంభమైంది. కేవలం రూ.10 నుంచే హస్త కళా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఏలూరు పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో విజయవాడకు చెందిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రాఫ్ట్‌ ఇండియా వారి హస్తకళా ప్రదర్శన క్రాఫ్ట్‌ బజార్‌ను ఏర్పాటు చేశారు. ఈ బజార్‌లో క్వాలిటీ గల జైపూర్‌ బెడ్స్‌, మట్టి కుండలు, పింగాణీ పాత్రలు, చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులు, మంచి డిజైన్‌ గల మహిళల డ్రస్సులు ఉన్నాయి. ఇక్కడ పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల ధర వరకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ప్రజలు ఎక్కువగా ఉండే చోట, రద్దీ ప్రదేశాల్లో , మార్కెటింగ్‌ క్రయ, విక్రయాలు కొనసాగుతాయో అక్కడ క్రాఫ్ట్‌ బజార్‌ పెట్టి క్వాలిటీ వస్తువులను అందిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వ్యాపారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ క్రాఫ్ట్‌బజార్‌ను పట్టణాల్లోనే కాకుండా పెద్ద పెద్ద నగరాల్లో కూడా పెట్టి క్వాలిటీ గురించి అందరూ చర్చించుకునేలా అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. క్రాఫ్ట్‌ బజార్‌లో ప్రత్యేకంగా ఇంటి అందాన్ని పెంచే కర్టన్స్‌, తలకడ దిండులు, ఇంటి గుమ్మం ముందు ఉంచే డిజైన్‌ ఐటమ్స్‌ ఉన్నాయన్నారు. అన్ని రకాల రంగురంగుల వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఏ వస్తువు చూసినా ఆకర్షణీయంగా కనబడుతున్నాయన్నారు. ఇక్కడ సుమారుగా 40 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ క్రాఫ్ట్‌ బజార్‌ ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఈ ప్రదర్శన ఇంకా కొన్ని రోజుల మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఇక్కడ తయారీదారులచే నేరుగా అమ్మకం జరుగుతుందని తెలిపారు.ఈ క్రాఫ్ట్‌ బజార్‌లో మట్టితో తయారుచేసిన వస్తువులు ఆకర్షణగా నిలిచాయి. అందులో మట్టి కుండలు, భోజనం చేయడానికి డిజైన్‌ ప్లేట్స్‌, మొక్కలు పెంచుకునే కుండీలు, చిన్నపిల్లలు ఆడుకునే పింగాణి బొమ్మలు రంగురంగులుగా ఇక్కడ దర్శనమిస్తాయి. అదేవిధంగా స్త్రీలకు కావాల్సిన మేకప్‌ కిట్స్‌, పెన్నులు, జడ కుచ్చులు, బొట్టు బిళ్లలు వంటివి చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి. భారతీయ సంస్కృతిలో ప్రాచుర్యం పొందిన బొమ్మలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఖాదీ వస్త్రములు, బెంగాలీ కాటన్‌ చీరలు, ఇమిటేషన్‌ జ్యువెలరీ, కలంకారి డ్రస్సులు, పింగాణీ పూల కుండీలు, రెడీమేడ్‌ డ్రస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏ వస్తువు కొనుగోలు చేసినా క్వాలిటీలో చాలా బాగున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. ఏలూరు ప్రజలు క్రాఫ్ట్‌ బజార్‌కు వచ్చి సందర్శించి కొనుగోలు చేయాలని, ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

➡️