ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఏలూరు గన్ బజారులోని సిఎస్‌ఐ చర్చి దగ్గర వైసిపి జిల్లా కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. వైసిపి జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, జిల్లా పార్లమెంట్ ఇన్‌ఛార్జి కారుమూరి సునీల్‌కుమార్, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మామ్మిళ్లపల్లి జయప్రకాష్, నూజివీడు ఇన్‌ఛార్జి మేకా వెంకటప్రతాపఅప్పారావు, ఉంగుటూరు ఇన్‌ఛార్జి పుప్పాల వాసుబాబు, చింతలపూడి ఇన్‌ఛార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్‌ఛార్జి తెల్లం బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత కీర్తిశేషులు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో జగన్ తనకు అప్పగించిన ఈ జిల్లా అధ్యక్షుని బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తనూ కలుపుకుని పని చేస్తానన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యకర్తకూ అండగా నిలబడి వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్దామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి తరపున మనం నిలబడి వైసిపికి పూర్వ వైభవం తీసుకువద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిటు, జెడ్‌పిటిసి సభ్యులు, వైస్ ఎంపిపిలు, పార్టీ మండలాధ్యక్షులు, ఎఎంసి మాజీ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
