పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సిపిఎం ఆధ్వర్యాన ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
ఏజెన్సీ భూ సమస్యలు పరిష్కరించాలని, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.రామకృష్ణ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేస్తున్న ఎల్‌టిఆర్ భూములపై రెవెన్యూ అధికారులు చట్టానికి విరుద్ధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్లతో గిరిజనులను వేధిస్తున్నారన్నారు. బుట్టాయగూడెం మండలం మర్లగూడెం, ఇనుమూరు, జైనవారిగూడెం, జీలుగుమిల్లి మండలం సిరివారిగూడెం గ్రామాల్లోని సుమారు 150 ఎకరాలుపైగా ఎల్‌టిఆర్ భూములను గిరిజనులు గత 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నారని ఈ భూములపై బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తహసిల్దార్ల గిరిజనేతరులతో కుమ్మక్కై గిరిజనులు వేసిన పంటలను దౌర్జన్యంగా దున్నివేశారన్నారు. ఒక్క గిరినేతర భూస్వామిపైన కేసు నమోదు చేయలేదని, గిరిజనుల మీద తప్పుడు కేసులు నమోదుచేసి వేధిస్తున్నారన్నారు. రెవెన్యూ తగాదాల్లోని పోలీసువారి జోక్యంతో బాగా పెరిగిందని భూములకు సంబంధించిన రికార్డు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి చూపించమని వేధిస్తున్నారన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు గిరిజనేతర భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మొడియం నాగమణి మాట్లాడుతూ బుట్టాయగూడెంలోని ఇళ్ల స్థలాలకు సర్వేచేసి ప్రభుత్వ భూమి గిరిజనులకు అప్పచెప్పమని అధికారులను ఆదేశించినప్పటికీ కనీసం ఇప్పటివరకు బుట్టాయగూడెం తహశీల్దార్ కనీసం అటువైపు చూడటం లేదన్నారు. జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని గిరిజనులకు చెందిన రికార్డు వెరిఫికేషన్ చేయకుండా ఏకపక్షంగా రెవెన్యూ అధికారులు ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చి గిరిజనులను వేధిస్తున్నారని, వాటి ఆధారంగా పోలీసువారు భూముల్లోకి వచ్చి తప్పుడు కేసులు నమోదుచేసి గిరిజనులను భయభ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. వీటిని తక్షణమే ఆపకపోతే మాత్రం పెద్దఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు, ఎం.జీవరత్నం, మండలాల నాయకులు పోలోజు నాగేశ్వరరావు, జి.సూర్యకిరణ్, అందుగుల ప్రభాకర్, చుండ్రు బుల్లెమ్మ, కన్నమ్మ, గిరిజన జ్యోతి నాయకులు నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ ధర్నాలో వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు. తొలుత తహశీల్దార్ కార్యాలయం నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ రమణకు వినతిపత్రం అందించి సమస్యలను వివరించారు. ఆమె స్పందిస్తూ నెలరోజుల్లో రెవెన్యూ అధికారులతో ఈ సమస్యలపై సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ఉభయ రికార్డులు పరిశీలన చేస్తామని, బుట్టాయగూడెం ఇళ్లస్థలాల్లో సరిహద్దులు నిర్ణయిస్తామని, పోలీసుల జోక్యం నివారించేలా చర్యలు తీసుకుంటామని, ప్రొటెక్షన్ ఆర్డర్లపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని గిరిజనులకు తగు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
