పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలి

టిడిపి నేత గంటా సత్యంబాబుకు ప్రయివేట్‌ దస్తావేజు లేఖరుల వినతి
ప్రజాశక్తి – కామవరపుకోట
పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతూ మండల ప్రయివేట్‌ దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్‌ టిడిపి నాయకులు గంటా సత్యంబాబుకు వినతిపత్రం అందించారు. స్థానిక రిజిస్టర్‌ కార్యాలయం వద్ద ప్రయివేట్‌ దస్తావేజు లేఖరులందరూ కలిసి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని టిడిపి నాయకులు గంట సత్యంబాబుకు అందించారు. ఈ సందర్భంగా లేఖరుల సంఘం అధ్యక్షులు రవికుమార్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్‌ 2.0 జిఒ వల్ల ప్రజలు, దస్తావేజు లేఖరులు నష్టపోతారని తెలిపారు. రాజ్యాంగపరంగా వచ్చిన రిజిస్ట్రేషన్‌ హక్కును గత వైసిపి ప్రభుత్వం మంటగలిపే ప్రయత్నం చేసిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పారు. ప్రైమ్‌ 2.0 జిఒ వల్ల ప్రతిఒక్కరూ రిజిస్టర్‌ కార్యాలయానికి రావాల్సి ఉందని, వృద్ధులు, వికలాంగులు ప్రమాదాల్లో గాయపడిన వారు కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్‌ పద్ధతులను మార్చాలంటే 1908 యాక్ట్‌ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. సచివాలయ వ్యవస్థకు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు అప్పగిస్తామని, గత ప్రభుత్వం చేసిన వాగ్దానంతో ప్రజలు భయబ్రాంతులకు గురై తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను నిర్వహించేలా చేయాలని దస్తావేజు లేఖరులందరూ ముక్తకంఠంతో కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందుకున్న టిడిపి నాయకులు గంటా సత్యంబాబు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల సమస్యను ఎంఎల్‌ఎ, ఎంపీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్‌ దస్తావేజు లేఖరులు పజ్జురి రాము, పెరవలి రాజేంద్రప్రసాద్‌, రామకృష్ణ, రాజాజీ, దాసరి సుబ్బారావు పాల్గొన్నారు.

➡️