పశ్చిమ ఏజెన్సీలో భూసమస్యలను పరిష్కరించాలి

Apr 15,2025 22:17

గిరిజన చట్టాలను అమలు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుతెల్లం రామకృష్ణ
ప్రజాశక్తి – పోలవరం
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో భూసమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ పశ్చిమ ఏజెన్సీలో భూవివాదాలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. భూవివాదాలు తలెత్తినప్పుడు గిరిజనేతరుల భూమి రికార్డులు టైటిల్‌ వెరిఫికేషన్‌ చేయకుండా గిరిజనులను రికార్డులు తీసుకురమ్మని తహశీల్దార్‌ చెప్పడం సరైంది కాదన్నారు. 1/70, ఎల్‌టిఆర్‌ గిరిజన చట్టాలున్నా రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదన్నారు. గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన అధికారులే ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. భూవివాదాల్లో పోలీసుల జోక్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎల్‌టిఆర్‌, 1/70 చట్టం భూములను సాగు చేస్తున్నా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావడం లేదన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లో 1బి, అడంగల్‌లో నమోదు చేసి హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2011లో ఇటుకలకోట గిరిజనులకు కొంతమందికి పోడు భూములకు హక్కు పట్టాలిచ్చినా అటవీ అధికారులు ఆ భూముల్లో సరిహద్దు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మండల కార్యదర్శి కారం భాస్కర్‌ మాట్లాడుతూ మండలంలో రహదారులన్నింటినీ బాగు చేయాలన్నారు. కల్వర్టులు, వంతెనల నిర్మాణం చేపట్టాలన్నారు. శ్మశానాలు, తాగునీరు, డ్రెయినేజీలు, పాఠశాలల విలీనం సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు తామా బాలరాజు, బొరగం భూచంద్రరావు, మడివి చలపతిరావు, కొమరం పోసిరత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️