కార్మిక దృక్పథం గల వ్యక్తి లెనిన్‌

శతవర్థంతి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
లెనిన్‌ చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు, కార్మిక దృక్పథంతో నడిచిన వ్యక్తి అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కార్యదర్శి ఎం.జీవరత్నం అధ్యక్షతన లెనిన్‌ శతవర్థంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. తొలుత లెనిన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ కారల్‌ మార్క్స్‌, ఎంగిల్స్‌ రాసిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, ప్రాణాలికను అధ్యయనం చేసి రష్యాలో జార్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి కార్మికులను, రైతులను, ప్రజలందరినీ ఐక్యం చేసి వీరోచిత పోరాటాలు నిర్వహించి రష్యాలో కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి లెనిన్‌ అని కొనియాడారు. ప్రపంచంలోనే కార్మికులకు సమాన హక్కుల కల్పన కోసం, రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ కూలీలకు హక్కులు, దేశం అభివృద్ధి కావాలంటే సంపద మొత్తం ప్రజలందరికీ సమానంగా పంచాలని లెనిన్‌ పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. లెనిన్‌ స్ఫూర్తి తోటి ప్రపంచంలోని కమ్యూనిస్టు సిద్ధాంతం అనేక దేశాల్లో అమలు చేసి రాజ్యాధికారంలోకి వచ్చాయని, భవిష్యత్తులో భారత దేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతం రాజ్యాధికారం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో కేంద్రంలో నెగ్గిన బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంతో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కుట్రలు పన్నుతోందని, దేశంలోని ప్రజలందరినీ కులం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తుందన్నారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతం కీలకంగా మారిందని, మతోన్మాదాన్ని ఎదుర్కొవటం కోసం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, ప్రజలు సిపిఎం చేసే పోరాటాలకు మద్దతు పలకాలని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అందరూ కలిసి రావాలని, అప్పుడే ప్రజలంతా ఐకమత్యంగా కలిసి ఉంటారని, అప్పుడే లెనిన్‌కి ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జె.సూర్యచంద్రం, ఎ.ప్రభాకరరావు, వై.సీత, పటాన్‌, మస్తాన్‌, ఎన్‌.వెంకన్న, కె.సుబ్బారావు, డి.ఆశీర్వాదం, పి.సునీల్‌, కె.వెంకటేశ్వరరావు నిర్వహించారు.

➡️