19న విజయవాడలో మహాధర్నా

ప్రజాశక్తి – చింతలపూడి
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల వేతనాల పెంపునకు ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మహాధర్నా కరపత్రాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు నెలకు రూ.పది వేల వేతనం ఇవ్వాలని, ఎలాంటి కారణాలు లేకుండా అర్ధాంతరంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికీ రూ.30 మెజ్‌ ఛార్జీలు పెంచాలని కోరారు. ఈ నెల 19న జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొంగర శాంత, పద్మ, రమాదేవి, భూక్య శాంత, బత్తుల నాగమణి, చిన్ను కృష్ణవేణి పాల్గొన్నారు.

➡️