మలమల..సలసల..!

వారంతా భావి భారత పౌరులు.. విజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా అక్కడకు చేరుకున్నారు.. అయితే అన్నార్తుల్లా ఆకలి మంటలతో మలమల్లాడుతూ, మరోపక్క అపరిశుభ్ర వాతావరణం.. కలుషిత ఆహారంతో అనారోగ్యం పాలై విలవిల్లాడుతున్నారు. ఇదీ రెండు జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన నూజివీడు ట్రిపుల్‌ ఐటితోపాటు పలు విద్యాసంస్థలు, హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితి. అదే సమయంలో జిల్లావ్యాప్తంగా పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్నిచోట్లా జనం జ్వరాలతో మూలుగుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లినా సలసలలాడే జ్వరం తగ్గక తల్లడిల్లుతున్నారు. ఇదే సమయంలో డెంగీ మరణాలు జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.రెండు జిల్లాల్లో గ్రామీణ, పట్టణప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పులు వంటి సమస్యలతో జనం ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. చికిత్స పొందినా వీటి ప్రభావం కనీసం వారం నుంచి పది రోజులకుపైనే ఉంటోంది. దీంతో ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. డెంగీ కేసులు అధికారికంగా నమోదు చేయడానికి, చూపడానికి వైద్యారోగ్య శాఖాధికారులు ఇష్టపడటం లేదు. దీంతో జనం సమీప పట్టణాల్లోని ప్రయివేటు ఆస్పత్రులకే వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఏజెన్సీ, మెట్ట, డెల్టా ప్రాంతాల్లో డెంగీ మరణాలు చోటుచేసుకోవడం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం మాత్రం జ్వరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఆచరణలో అటువంటి దాఖలాలేవీ కానరావడం లేదు. పైగా అపారిశుధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం తదితర సమస్యలు జనాలను పట్టిపీడిస్తున్నాయి. తక్షణం ప్రభుత్వం రెండు జిల్లాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి గ్రామీణప్రాంతాల్లో విరివిగా వైద్యశిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. డెంగీ, టైఫాయిడ్‌, డయేరియా వంటి రోగాలబారిన పడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపడితే పరిస్థితి ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉంది. అలాకాకుండా గత ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని విమర్శలు చేస్తూ కూర్చుంటే గత పాలకులకు, ప్రస్తుత పాలకులకు తేడా లేకుండా పోతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర ప్రజారోగ్య శాఖాధికారులు పర్యటించి హెచ్చరించినా మెస్‌ల నిర్వహణలో మార్పు రాకపోవడం వ్యవస్థీకృతంగా పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ సెలవుపై వెళ్లిపోయారు. జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి శుక్రవారం రాత్రి వరకూ ట్రిపుల్‌ఐటి ప్రాంగణంలో ప్రత్యక్ష చర్యలకు దిగడం విద్యార్థులకు కొంత ఉపశమనాన్నిచ్చింది. కార్యాచరణలో రానున్న రోజుల్లో మెస్‌ల నిర్వహణ మెరుగ్గా సాగితే విద్యార్థులకు అర్థాకలి, అనారోగ్యం దూరమవుతాయి. అలాగే జిల్లాలోని అన్ని గురుకుల, ఆశ్రమ పాఠశాలలతోపాటు హాస్టళ్లన్ని ంటిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై తక్షణం హెల్త్‌ చెకప్‌లు నిర్వహించాలి. అవసరమైన మందులు అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర నెలలు దాటింది. గత వైసిపి ప్రభుత్వంలో వివిధ పదవులు చేపట్టిన వారు పక్కచూపులు చూస్తున్నారు. వైసిపి అధినా యకత్వంపై అపనమ్మకమో.. లేక తమ పదవీకాలంలో చేపట్టిన పనులపై ఎటువంటి చర్యలుంటాయోననే ఆందోళనో చాలామంది నేతలు మౌనంగా ఉంటున్నారు. మరికొందరైతే అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌, పెదబాబు దంపతులు, వైసిపి ఏలూరు నగరాధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌, ఇడా ఛైర్‌పర్సన్‌ బొద్దాని అఖిల, మాజీ ఎఎంసి ఛైర్మన్‌ మంచెం మైబాబు తదితరులు వైసిపికి గుడ్‌బై చెప్పారు. ఆపై నాని తప్ప మిగిలిన వారంతా నారా లోకేష్‌ సమక్షంలో టిడిపి గూటికి చేరారు. మరి నాని రూటెటో వేచిచూడాలి. ఇదేరీతిన రెండు జిల్లాల్లో కొంతమంది వైసిపి నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలెవ్వరూ పార్టీ దిగువ శ్రేణుల నేతల్లో ఆత్మస్థయిర్యం నింపే పని చేయకపోవడంతో ఆ పార్టీ మండలస్థాయి నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర గందరగోళంలో ఉన్నారు. పాలకొల్లు మినహా మిగతా ఎక్కడా వైసిపి నేతలు యాక్టివ్‌గా కన్పించడం లేదు. ఎంఎల్‌సిలు రవీంద్రనాధ్‌, కవురు శ్రీనివాస్‌ సైతం అప్పుడప్పుడు అధికారిక సమావేశాల వంటి వాటిలోనే కన్పిస్తున్నారు. మొత్తానికి గత ఎన్నికల ముందు వరకూ సందడి చేసిన వైసిపి అధికారం కోల్పోయాక పూర్తిగా నిస్తేజమైపోయిందనడంలో ఎటువంటి సందేహామూ లేదు. విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️