ఏలూరు సిటీ : రైతే దేశానికి వెన్నెముక అని ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి చంటి అన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతల కష్టాన్ని విని ఆయన చలించిపోయారు. ఆ కష్టాన్ని తీర్చేందుకు తానే అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుని, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపారు. ఏలూరు వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను మంగళవారం ఎంఎల్‌ఎ బడేటి చంటి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను ఆయన క్షుణ్ణంగా విని తెలుసుకున్నారు. పంట చివరి దశలో ఉన్న వరి పొలాలకు కాలువ నీరు అందడం లేదని రైతులు తెలుపగా, ఎంఎల్‌ఎ స్పందించారు. పంటకు నీరు అందించేందుకు వాటర్ ఇంజిన్ ఏర్పాటు చేసుకోమంటూ రైతులకు తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందించారు. వారి సాగునీటి సమస్యకు వేగవంతమైన పరిష్కారం అందించండంతో ఎంఎల్‌ఎ చంటి తీరుపట్ల రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బారగడ వెంకటేశ్వరరావు, కడమటి వీరబాబు, నెరుసు గంగరాజు పాల్గొన్నారు.
