గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
చూసీ చూడనట్లు ఎక్సైజ్ అధికారుల తీరు
మద్యం సరఫరా చేసే దుకాణాలపై చర్యలు శూన్యం
ప్రజాశక్తి – చింతలపూడి
బెల్టుషాపులు నిర్వహించేవారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటే వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. బెల్ట్‌షాపులకు అనుమతులు లేకపోయినా నిర్వహించాలని దుకాణదారులు ప్రోత్సహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖాధికారులు బెల్టుషాపుల నిర్వహించేవారినే పట్టుకుంటున్నారని, మద్యం సరఫరా చేసే దుకాణదారులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. సర్కారు మద్యం దుకాణం నిర్వహించే విధానానికి స్వస్తి పలికి ప్రయివేట్ వ్యక్తులు మద్యం షాపులు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. లాటరీ పద్ధతిలో ప్రయివేట్ వ్యక్తులు మద్యం షాపులను దక్కించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో మాదిరిగానే అనుమతి పొందిన మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో పెద్దలు, ఇతరత్రా నాయకులతో బెల్టుషాపు నిర్వహించే ఆసక్తి ఉన్నవారితో మంతనాలు సాగిస్తున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటుపై కొందరు ఇప్పటికే సిద్ధమైనారు.ఎక్సైజ్ శాఖ వారు బెల్ట్ షాపుల నిర్వాహకులపై మాత్రమే కేసు నమోదు చేస్తున్నారు. బెల్టు షాపులు అమ్ముకోవడానికి మద్యం సరఫరా చేసే దుకాణదారులపై, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసు వారు ఇప్పటివరకు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపు నడిపే వ్యక్తులు మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలుసుకుని వారిపై ఎందుకు కేసును నమోదు చేయడంలేదో అర్థం కాని పరిస్థితి. ఇటీవల బెల్ట్ షాపు నడిపే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ప్రభుత్వంలో సారా స్థావరాలపై దాడులు చేస్తే సారా ఎక్కడి నుంచి వచ్చిందో, సారా తయారీకి బెల్లం ఎవరు సరఫరా చేస్తున్నారో తెలుసుకుని బెల్లం అమ్మకం దుకాణదారులపై కూడా కేసులు నమోదు చేసిన సంఘటనలు మండలంలో ఉన్నాయి. బెల్టుషాపులు అక్రమంగా అమ్ముకుంటూ పట్టుపడితే, బెల్ట్ అమ్మడానికి మద్యం ఎవరు సరఫరా చేశారో తెలుసుకుని ఆ దుకాణదారులపై కేసు నమోదు చేసి లైసెన్స్ క్యాన్సిన్ చేస్తారా లేదా అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా నడిపిస్తారా లేదా, అక్రమంగా బెల్ట్ షాపులకు అనుమతులు ఇస్తూ గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ మహిళలను ఇబ్బందులు పెడతారా అనేది అర్థం కాని విషయం.