కౌలు రైతులకు..రుణార్హతకార్డులేవీ..!

నేటికీ ప్రారంభం కాని కౌలుకార్డుల జారీ
ప్రక్రియఖరీఫ్‌ నారుమడులకు రైతులు సన్నద్ధం
బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేనా
రెండు జిల్లాల్లో 3 లక్షల మందికౌలురైతులకు అన్యాయం
కౌలుచట్టంలో కొత్త ప్రభుత్వం మార్పులు తెచ్చేనా?
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
జిల్లా వ్యవసాయ సాగులో కీలకపాత్ర పోషిస్తున్న కౌలురైతులను ప్రభుత్వం, అధికార యంత్రాంగం గాలికొదిలేసింది. జూన్‌ రెండో వారంలోకి వచ్చినా ఇప్పటి వరకూ కౌలురైతులకు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదరణ లేక నలిగిపోతున్న కౌలురైతులకు కార్డులు ఇచ్చే అంశంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్‌ నారుమడులు వేసేందుకు జిల్లా రైతాంగం సన్నద్ధమైంది. మెట్ట ప్రాంతంలో నారుమడులకు సంబంధించి దుక్కులు సైతం జరుగుతున్నాయి. అయినప్పటికీ కౌలుకార్డుల జారీ ప్రక్రియ చేపట్టకపోవడంపై కౌలురైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యసాయసాగులో 70 శాతానికిపైగా వీరే చేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం కౌలురైతులను పట్టించు కోవడం లేదు. వైసిపి ప్రభుత్వం కౌలురైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభించిన పరిస్థితి కొనసాగింది. దీంతో బ్యాంకుల నుంచి పంటరుణాలుగాని, రైతుభరోసా సొమ్ముగాని, పంట నష్టపరిహారంగాని ఏఒక్కటీ కౌలురైతులకు అందకుండాపోయింది. గడిచిన ఐదేళ్లలో రెండు జిల్లాల్లోనూ అరకొరగానే కౌలుకార్డులు జారీ చేశారు. మూడు లక్షల మంది కౌలురైతులు ఉండగా పట్టుమని లక్షా 50 వేల మందికి కూడా కౌలు కార్డులు మంజూరు చేయలేదు. కౌలుకార్డులు అందుకున్నవారిలో సగం మందికి కూడా బ్యాంకుల నుంచి పంటరుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రతియేటా ఏప్రిల్‌లోనే గ్రామసభలు నిర్వహించి కౌలుకార్డులు అందజేత ప్రక్రియ ప్రారంభించేవారు. ఎన్నికల పేరుతో కౌలురైతులను పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి ఉంది. దీంతో జూన్‌ నెల గడిచిపోతున్నా ఏఒక్క కౌలురైతూ కౌలుకార్డు అందుకోలేకపోయారు. కౌలుకార్డులు ఉంటేనే బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. లేకపోతే కనీసం పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. కౌలుకార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కౌలురైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఏర్పడింది. కౌలుకార్డుల జారీ ప్రక్రియపై ఏలూరు వ్యవసాయ శాఖ జెడి హబీబ్‌ భాషాను వివరణ కోరగా టార్గెట్లు నిర్ణయించుకున్నామని, జారీ ప్రక్రియ ప్రారంభించనున్నామని తెలిపారు.కౌలుచట్టంలో మార్పులపై తీవ్ర చర్చ వైసిపి ప్రభుత్వం వచ్చాక కౌలురైతులను దెబ్బకొట్టే కుట్రలకు దిగింది. అందులో భాగంగా 2011 కౌలుచట్టంలో మార్పులు చేసింది. 2019 పంట సాగుదారుని హక్కుచట్టం పేరుతో కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టంలో అత్యంత దారుణమైన మార్పులు చేసింది. పాత చట్టంలో భూయజమానితో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌలురైతులకు కౌలుకార్డులు జారీ చేయాలని ఉండేది. వైసిపి తెచ్చిన చట్టంలో భూయజమాని అంగీకరిస్తేనే కౌలురైతులకు కౌలుకార్డులు జారీచేయాలని పెట్టారు. ఇది కౌలురైతులకు ఉరితాడుగా మారింది. కౌలురైతులకు కౌలు కార్డులు ఇచ్చేందుకు భూయజమానులు ససేమిరా అంటున్నారు. వారికి అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైన పరిస్థితి నెలకొంది. దీంతో గడిచిన ఐదేళ్లలో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలుకార్డులు కూడా లేకపోవడంతో పండించిన ధాన్యంసైతం భూయజమాని పేరున అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇది కౌలురైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కౌలుచట్టంలో టిడిపి కూటమి ప్రభుత్వం మార్పులు తెస్తుందా అనే చర్చ కౌలురైతుల్లో నడుస్తోంది. భూయజమానితో సంబంధం లేకుండా కౌలుకార్డులు జారీచేసేలా చట్టంలో మార్పులు చేయాలని అంతా కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఆ విధంగా చేస్తే కౌలురైతులకు మేలు జరగనుంది. లేకపోతే వైసిపి ప్రభుత్వంలో మాదిరిగానే కౌలురైతులకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు.

➡️