మహోన్నత వ్యక్తి ఎన్‌టిఆర్‌

101వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీని స్థాపించి, ఆనతికాలంలోనే అధికారాన్ని చేపట్టి ఖ్యాతిని గడించి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు ఎంఎల్‌ఎ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు ఎంఎల్‌ఎ అభ్యర్థి బడేటి చంటి కొనియాడారు. ఎన్‌టిఆర్‌ 101వ జయంతి వేడుకలను టిడిపి శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన ఆనతికాలంలోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్‌టిఆర్‌కె దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి, ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చారని, పేదవారికి అండగా ఉండడమే పార్టీ సిద్ధాంతంగా పని చేశారన్నారు. బడేటి చంటి మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ ఆశయాలతో ఎన్నికల్లో కార్యకర్తలంతా సమిష్టిగా పని చేశారని, 1983 ఫలితాలు 2024లో పునరావృతం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మరడాని రంగారావు, ఉప్పాల జగదీష్‌బాబు, ఎంఆర్‌డి.బలరాం, చోడే వెంకటరత్నం, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️