నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నిరంకుశ వైఖరి
పథకం వర్తించినా అందని వైద్యం
ప్రసవాలు, ఎముకలు, కిడ్నీ వ్యాధుల్లో పరిస్థితి మరింత దారుణం
రూ.లక్షల్లో చెల్లించేందుకు రోగుల బంధువుల కన్నీరుమున్నీరు
ఫిర్యాదు చేస్తే వైద్యం అందించబోమని బెదిరింపులు
ప్రభుత్వం నుంచి నియంత్రించే వ్యవస్థ కరువు
భీమవరంలోని ఎన్‌టిఆర్ వైద్యసేవ పరిధిలోని నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఓ మహిళ ప్రసవం చేయించుకుంది. నిబంధనల ప్రకారం ఒక్క రూపాయీ చెల్లించకుండా ఉచితంగా ఎన్‌టిఆర్ వైద్యసేవలో కాన్పు చేయాలి. అందుకు విరుద్ధంగా రూ.20 వేలు వరకూ అదనంగా వసూలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇదేమని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం సరైన సమాధానం చెప్పని పరిస్థితి ఉంది. గట్టిగా నిలదీస్తే రోగికి వైద్యం అందించరేమోననే భయం ఆ కుటుంబాన్ని వెంటాడటంతో మౌనంగా రోదించడం తప్ప వేరే గత్యంతరం తప్పడ ంలేదు’.
‘ఏలూరు జిల్లా పరిధిలో ఒక యువకుడు ప్రమాదంలో కాలు ఎముక విరిగింది. ఏలూరులోని ప్రయివేటు ఆసుపత్రిలో చూపిస్తే విజయవాడ తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడ ఎన్‌టిఆర్ వైద్యసేవ ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎన్‌టిఆర్ వైద్య సేవ వర్తింపజేయకుండా ఎముక ఆపరేషన్‌కు సొమ్ము వసూలు చేసిన పరిస్థితి నెలకొంది. అడిగితే వేరే ఆసుపత్రికి వెళ్లిపోవాలని అంటారనే భయంతో రోగి కుటుంబీకులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
‘ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పేదోడి ఆరోగ్యానికి ఎన్‌టిఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం భరోసా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్‌టిఆర్ వైద్యసేవలో నిర్ధేశించిన రోగాలకు సైతం నెట్‌వర్క్ ఆసుపత్రులు పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో సామాన్య ప్రజానీకానికి ఏం చేయాలో అర్థం కాక అప్పులు తెచ్చి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో అదనంగా డబ్బులిస్తేనే చేర్చుకుంటామంటూ ఎన్‌టిఆర్ వైద్యసేవలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు రోగుల బంధువులను బెదిరించి మరీ జేబులు గుల్ల చేస్తున్న పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లాలో 31, పశ్చిమగోదావరి జిల్లాలో 23 ప్రయివేటు ఆసుపత్రులు ఎన్‌టిఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రులుగా ఉన్నాయి. కంటి ఆపరేషన్లు, కిడ్నీ, ఎముకలు, కేన్సర్, గుండె ఇలా అనేక రోగాలకు ‘ఎన్‌టిఆర్ వైద్యసేవ’లో చికిత్స అందించాల్సి ఉంది. ప్రతినెలా పెద్దఎత్తున సర్జరీలు జరుగుతున్నాయి. అయితే ఉచితంగా మాత్రం జరగడం లేదనేది మాత్రం వాస్తవం. సంబంధిత వ్యాధులకు ప్రభుత్వం నిర్ధేశించిన రుసుములకు అంగీకరించిన ఆసుపత్రులే ఎన్‌టిఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాలో ఉంటాయి. అయినప్పటికీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం సరిగ్గా అమలు కాని పరిస్థితి ఉంది. ఎన్‌టిఆర్ వైద్యసేవలో రోగిని చేర్చుకున్నా భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రోగులు, వారి బంధువులు ఫిర్యాదు చేయకుండా తామేమీ చేయలేమంటూ ఎన్‌టిఆర్ వైద్యసేవా విభాగం చేతులెత్తేసోంది. దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లు పరిస్థితి తయారైంది. నిబంధనల ప్రకారం ఎన్‌టిఆర్ వైద్యసేవలో వర్తించే రోగానికి ఓపి నుంచి అన్ని టెస్టులూ ఉచితంగానే చేయాలి. ఒకవేళ ముందుగా ఏమైనా టెస్టులు చేసి డబ్బులు తీసుకుంటే ఎన్‌టిఆర్ వైద్యసేవ వర్తింపజేసిన తర్వాత ఆ సొమ్ము తిరిగిచ్చేయాలి. ఏఒక్క ఆసుపత్రిలోనూ ఇది జరగడం లేదు. అక్కడ పని చేసే ఆరోగ్యమిత్రలు సైతం ఆసుపత్రుల నిరకుంశ వైఖరిని ఎదిరించలేని పరిస్థితి కనిపిస్తోంది. రోగి బంధువులు డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ వారు తీసుకునే చర్యలు పెద్దగా కన్పించడం లేదు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి రోగి బంధువులను దారికి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రుల దోపిడీని నిరోధించే వ్యవస్థ కరువు ఎన్‌టిఆర్ వైద్యసేవలోని అత్యధిక ఆసుపత్రుల్లో వసూళ్లప ర్వం నిర్విరామంగా సాగుతోంది. దీన్ని కఠినంగా నిరోధించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. కొనఊపిరితో తీసుకొచ్చిన రోగి బంధువులను మానసికంగా ఇబ్బంది పెట్టి వసూళ ్ల దందా సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే రోగి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందనే భయం కుటుంబీకులను వెంటాడుతోంది. దీంతో అప్పు చేసి మరీ ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు. అటువంట ప్పుడు ఎన్‌టిఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఉండి ఏమిటి ప్రయోజనం అనే చర్చ జనంలో నెలకొంది. ఎన్‌టిఆర్ వైద్యసేవలో రోగి బంధువుల నుంచి డబ్బు వసూలు చేసినా, వైద్యం అందించబోమని నిరాకరించినా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో, లేదో వేచిచూడాలి.
