నూజివీడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి
ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌
నూజివీడు నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక ఎంఆర్‌.అప్పారావు కాలనీలో తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్‌ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం గత వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరును అవుతానని, ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే మోడల్‌ నియోజకవర్గంగా నిలబెడతానన్నారు. నూజివీడు పట్టణమంతా ఒకే విధమైన డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు టెండర్లు పిలిచామని, నెలరోజుల్లోగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నూజివీడులో ఎంఆర్‌.అప్పారావు కాలనీ అతిపెద్ద కాలనీ అని, కాలనీ అభివృద్ధికి అవసరమైన తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజీ, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్‌.అప్పారావు కాలనీలోని 24 రోడ్లలో పది రోడ్లలో పైపులైన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామని, మిగిలిన రోడ్లలో కూడా పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఆర్‌టిసి బస్‌ సర్వీస్‌ ఏర్పాటు చేస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణిదుర్గ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకట్రామిరెడ్డి, డిఇ లక్ష్మీనారాయణ, ప్రముఖులు బర్మా ఫణిబాబు, కాపా శ్రీనివాసరావు, తలపంటి రాజశేఖర్‌, చెరుకూరి దుర్గాప్రసాద్‌, మున్సిపల్‌ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 వేల చెక్కును మంత్రి పార్థసారథికి అందించారు. ఈ సందర్భంగా విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి విరాళం అందజేసిన మహిళలను మంత్రి అభినందించారు.రూ.4 కోట్లతో చెరువు గట్ల మరమ్మతులు ఇటీవల భారీవర్షాలు, వరదల కారణంగా నూజివీడు నియోజకవర్గంలో దెబ్బతిన్న చెరువు గట్ల మరమ్మతు పనులకు రూ.నాలుగు కోట్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడులో ఇటీవల వరదల కారణంగా గండి పడిన పెద్దచెరువు గట్టు మరమ్మతు పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నూజివీడులో పలు చెరువులకు గండ్లు పడి ప్రజలు ఎన్నో కష్టాలు పడటంతోపాటు పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. చెరువుల గట్లపై ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. నియోజకవర్గంలో చెరువులకు గండ్లు పడి రూ.22 కోట్లు మేర నష్టం జరిగిందన్నారు. గండ్లు కారణంగా ఆయా చెరువుల్లో నీటిని నిల్వ చేసే అవకాశం లేదని, దాంతో ప్రస్తుతం, రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకే గండ్లు పూడ్చివేత పనులు యుద్దప్రాతిపదికన చేపట్టినట్లు వివరించారు.టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేస్తాం గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల టిడ్కో ఇళ్ల లబ్దిదారులు బ్యాంకర్ల ముందు దోషులుగా నిలబడ్డారని మంత్రి పార్థసారథి అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తికాక, రుణాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 8వ వార్డులో రూ.11.15 లక్షలతో నిర్మించనున్న డ్రెయిన్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం డిఎఆర్‌ కాలేజీ వద్ద రూ.14.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్‌ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

➡️