సామాజిక పెన్షన్ల పంపిణీలో మండలాధికారుల అత్యుత్సాహం
తెల్లవారుజామున 5 గంటలకు రావాలని సిబ్బందికి హుకుం
6 గంటలకు లాగిన్ కావాలనే ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు
పంపిణీకి అత్యధిక పంచాయతీ కార్యదర్శులు దూరం
రెండు జిల్లాల్లో దాదాపు 9వేల మంది ఉద్యోగుల అవస్థలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
సామాజిక పెన్షన్ల పంపిణీలో మండలాధికారుల అత్యుత్సాహాంపై సచివాలయ, ఇతర ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలకు భిన్నంగా ఆదేశాలిస్తూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి మండల, గ్రామస్థాయిలో నెలకొంది. ఒకటో తేదీన పెన్షన్ అందించడం అందరూ హర్షించదగిన విషయం. అందుకుగాను తెల్లవారుజామున ఐదు గంటలకు లాగిన్ అయ్యి పెన్షన్లు పంపిణీ చేయాలని మండల అధికారులు హుకుం జారీ చేయడం ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో వాలంటీర్లు ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసి తర్వాత తమ సొంత పనులు చేసుకునేవారు. ఉద్యోగుల పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తెల్లవారుజామున ఐదు గంటలకు విధుల్లో చేరినా సాయంత్రం ఐదు గంటల వరకూ డ్యూటీలో ఉండాలని పంచాయతీ కార్యదర్శులు పనులు అప్పగిస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు పిల్లల విషయంలోనూ, వంట చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్న సమయం ఉదయం ఆరు గంటలు. మండలాధికారులు మాత్రం ఐదు గంటలకే రావాలంటూ సచివాలయ ఉద్యోగులకు హుకుం జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఒకటో తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో 2,32,885 మందికి రూ.155.71 కోట్లు వివిధ సామాజిక పెన్షన్ల కింద పంపిణీ జరుగుతోంది. ఏలూరు జిల్లాలో 2,68,535 మందికి రూ.182.73 కోట్లు పెన్షన్ల కింద అందిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు, స్కూళ్లలో పని చేసే జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, అంగన్‌వాడీ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన పశ్చిమగోదావరిలో 4,015 మంది, ఏలూరు జిల్లాలో ఐదు వేల మంది వరకూ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. సచివాలయ ఉద్యోగులు మాత్రం పూర్తిస్థాయిలో పెన్షన్ల పంపిణీలో ఉంటున్నారు. ప్రతి ఉద్యోగీ 50 నుంచి 60 మందికి పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు. ఒకటో తేదీకి ముందు రోజు సచివాలయ ఉద్యోగి అయిన సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ సొమ్ము బ్యాంకు నుంచి డ్రా చేసి ఉద్యోగులందరికీ ఇస్తున్నారు. ఉద్యోగులు ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకు ప్రారంభించినా మధ్యాహ్నానికి పెన్షన్ల పంపిణీ పూర్తిచేసే అవకాశం ఉంది. తెల్లవారుజామున ఐదు గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని మండలాధికారులు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శీతాకాలం ప్రారంభమైంది. ఉదయం ఐదు గంటలకు చీకటిగానే ఉంటుంది. అటువంటి సమయంలో మహిళా ఉద్యోగులు పెన్షన్ సొమ్ము తీసుకుని బయటికి వస్తుంటే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేపడంతో పెన్షన్ సొమ్ము అందుకుంటున్న కుటుంబాల్లోని సభ్యులు కూడా ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మండలాధికారుల అతిని కట్టడి చేసి సచివాలయ, ఇతర ఉద్యోగులకు ఊరట కల్పించాలని పలువురు కోరుతున్నారు.పెన్షన్ల పంపిణీకి పంచాయతీ కార్యదర్శులు దూరం గ్రామ సచివాలయ, పంచాయతీ సిబ్బంది పూర్తిస్థాయిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అత్యధిక భాగం పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం లేదు. దీంతో ఉద్యోగులే ఆ పెన్షన్లను పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో మరింత ఆలస్యమవుతోంది. ఉదయం ఐదు గంటలకే విధుల్లో చేరినప్పటికీ సచివాలయ ఉద్యోగులకు సాయంత్రం ఐదు గంటల వరకూ వివిధ పనులు అప్పగిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సచివాలయ ఉద్యోగులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విధుల్లో ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. ఒకటో తేదీతోపాటు ఇతర రోజుల్లోనూ ఉదయం పది గంటలకే సచివాలయ ఉద్యోగులు రావాలని పంచాయతీ కార్యదర్శులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎదురు ప్రశ్నిస్తే పనుల పేరుతో తీవ్రంగా వేధిస్తుండటంతో అంతా హౌనంగా భరిస్తున్నారు. సచివాలయ వ్యవస్థపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.పదివేల వేతనంతో వాలంటీర్లను నియమిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. అధికారంలోకొచ్చి నాలుగునెలలైనా ఇప్పటి వరకూ వాలంటీర్ల నియామకం చేపట్టలేదు. వాలంటీర్లను నియమిస్తే పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.