ఓటర్ల నమోదులో అధికార యంత్రాంగం
15 వరకూ కొత్త ఓట్ల నమోదుకు అవకాశం
నవంబర్ 6న తుది ఓటర్ల జాబితా
ప్రజాశక్తి – డెస్క్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఎన్నికకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసిన 11 మండలాలతోపాటు మొత్తం 116 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అర్హులైన ఉపాధ్యాయుల ఓటు నమోదుకు జులై 29 నుంచి ఫారం-19 ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. సెప్టెంబర్ మూడో తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల జాబితాలను గత నెల 24న పోలింగ్ కేంద్రాలైన తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల్లో ప్రదర్శించారు. గత నెలలో గడువు ముగిసేటప్పటికి నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయుల నుంచి 14,388 దరఖాస్తులురాగా అందులో 13,677 దరఖాస్తులను అంగీకరించి 79 దరఖాస్తులను తిరస్కరించారు.15 వరకూ కొత్తగా ఓట్ల నమోదు గడువులోగా దరఖాస్తు చేసినా పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ వరకూ ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన గత నెల 24 నుంచి మొదలైంది. ఈ నెల 30 వరకూ అన్నింటినీ పరిష్కరిస్తారు. అలాగే సప్లిమెంట్ జాబితాలు తయారు చేసి నవంబర్ 6న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉపాధ్యాయుడిగా మూడేళ్లపాటు పని చేసిన వారికే ఓటరుగా అర్హత ఉంటుంది. జిల్లా బయటి నుంచి వచ్చి ఉద్యోగం చేసే వారికి ఓటు పొందే అవకాశం లేదు. జిల్లాలో నివాసం ఉండే ఉపాధ్యాయులకే ఓటు హక్కు అవకాశం ఉంది.
ఆసక్తిగా మారిన ఉప ఎన్నిక
పిడిఎఫ్ అభ్యర్థిగా బి.గోపీమూర్తి ఖరారు
ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఎన్నిక ఆసక్తిగా మారనుంది. ఎక్కువమంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి పోటీ ఎలా ఉంటుందోననే చర్చ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు దఫాలు ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు జరిగాయి. 2007 నుంచి 2009 వరకూ శేషారెడ్డి, రెండోసారి 2010 నుంచి 2015 వరకూ చైతన్యరాజు, మూడోసారి రాము సూర్యారావు, నాలుగోసారి 2021 మార్చి 17న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎంఎల్‌సిగా షేక్ సాబ్జీ విజయం సాధించారు. ఆయన 2023 డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 17,467 మంది ఓటర్లుండగా 16,054 ఓట్లు పోలయ్యాయి. 11 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. షేక్ సాబ్లీకి 7,987 ఓట్లు రాగా, వైసిపితో పాటు పిఆర్‌టియు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 6,453 ఓట్లు పోలయ్యాయి. దీంతో షేక్ సాబ్జీ 1,534 ఓట్ల మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టిడిపి మద్దతు తెలిపిన చెరుకూరి సుభాష్ చంద్రబోసుకు 106 ఓట్లు, బిజెపి మద్దతుతో పోటీ చేసిన ఇళ్ల సత్యనారాయణకు 300 ఓట్లు పడ్డాయి. పిడిఎఫ్ తరపున ఎంఎల్‌సిలుగా గెలుపొందిన రాము సూర్యారావు, షేక్ సాబ్జీ పనితీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పిడిఎఫ్ అభ్యర్థిగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి పేరు ఖరారైంది. ఆపై ఆయన ప్రచారం సైతం పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పిడిఎఫ్ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.
