‘పది’ పరీక్షలకు సన్నద్ధం

విద్యార్థులకు అదనపు తరగతులు
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు
ప్రజాశక్తి – చింతలపూడి
పదో తరగతిలో కార్పొరేట్‌ ఫలితాలను తలదన్నేలా ర్యాంకులు సాధించాలని, నూరుశాతం ఉత్తీర్ణతతో పాటు మంచి ర్యాంకులు సాధించాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ శిక్షణ ఇస్తున్నారు. అదనపు సమయం కేటాయిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి తర్ఫీదు ఇస్తున్నారు. కష్టమైన సబ్జెక్టులు సైతం సులువుగా ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. పాఠశాలలో నిర్ణీత సమయం కన్నా అదనంగా సమయం వెచ్చించి వారికి స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి 5:30 గంటల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచి చదివిస్తున్నారు. మామూలుగా ఆరు గంటల సమయం వరకు చదవాల్సి ఉన్నప్పటికీ ఏకంగా తొమ్మిది గంటలకు పైగా పాఠశాల విద్యార్థులు ఉంటున్నారు. దీంతో విద్యార్థులు కొంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ వారి భవిష్యత్తును ఆలోచించి వారికి అదనపు సమయం కేటాయించి చదివిస్తున్నామని మండలంలో పలు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. దీనికోసం మంచి పౌష్టికాహారం విద్యార్థులకు అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.గతంలో సుమారు 2018 వరకు విద్యార్థులకు అదనపు తరగతులకు జిల్లా పరిషత్‌ నుంచి అదనపు బడ్జెట్‌ కేటాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిధులు కేటాయించడం లేదు. సాయంత్రం ఎలాంటి స్నాక్స్‌ అందించడం లేదు. ప్రస్తుతం విద్యార్థులు సాయంత్రం సమయంలో అలసిపోతున్నారు. అదనపు తరగతుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం చేసిన భోజనంతో ఉంటూ ఆకలితో విద్యార్థులు అదనపు తరగతులు అభ్యసించాల్సి వస్తుంది. చింతలపూడి మండలంలో 1250 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరుగునున్నాయి.స్నాక్స్‌ అందించండిహర్ష, పదో తరగతి విద్యార్థిపదో తరగతి విద్యార్థులకు గతంలో అదనపు స్టడీ అవర్స్‌ కోసం స్నాక్స్‌ అందించేవారు. అవకాశం ఉంటే స్టడీ అవర్స్‌లో స్నాక్స్‌ అందించాలని అధికారులను కోరుతున్నాం. అదనపు తరగతులు నిర్వహిస్తున్నాంబాబూరావు, ప్రధానోపాధ్యాయులు, ఎర్రగుంటపల్లి పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించకపోతే వాటి ప్రభావం పరీక్ష ఫలితాలపై పడుతుంది. ఇంటి వద్ద చదవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత కోసం, ర్యాంకుల కోసం, ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తున్నాం.అల్పాహారం అందిస్తున్నాంబ్రాహ్మణేశ్వరమ్మ, నాగిరెడ్డిగూడెం ఎపిఆర్‌ బాలికల స్కూల్‌ హెచ్‌ఎంవిద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అలసటకు, ఒత్తిడికి గురి కాకుండా యోగా చేయిస్తున్నాం. అల్పాహారం అందిస్తు న్నాం. ఉత్తమ ర్యాంకులతోపాటు, వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, తాము కలిసి పని చేస్తున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరుగు తుంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకండా యోగా తరగతు లు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం.ప్రణాళిక బద్ధంగా ముందుకురామారావు, మండల విద్యాశాఖాధికారి పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులతో, ప్రధానోపాధ్యాయుల తో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. విద్యార్థులకు అదనపు స్టడీ అవర్స్‌లో స్నాక్స్‌ పెట్టడానికి నిధులు లేవు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారికి తోచినంతగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.

➡️