మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యత

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఏలూరులోని సిఆర్‌రెడ్డి కాలేజీలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలను మనోహర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో 181 టోల్‌ఫ్రీ నెంబర్‌ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించి, శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలో కోటి మందికిపైగా మహిళలకు దీపం-2 కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తిగా మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. తొలుత రూ.131.82 కోట్లు చెక్కుల రూపంలో మంత్రి డ్వాక్రా సంఘాలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పట్టా మహేష్‌ కుమార్‌, జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఎంఎల్‌ఎ బడేటి రాధాకృష్ణ, మేయర్‌ నూర్జహాన్‌, ఆర్‌టిసి రీజియన్‌ ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️