ప్రజాశక్తి – ముదినేపల్లి
మండలంలోని శింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్లో వేంచేసియున్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు విజయవంతం చేయాలని ఏలూరు ఆర్‌డిఒ అచ్యుత్ అంబరీష్ కోరారు. దేవస్థానం ప్రాంగణంలో సోమవారం షష్ఠి ఉత్సవాల నిర్వహణపై ఆర్‌డిఒ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు జరిగే స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలను అధికారులంతా కలిసి సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేయాలన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మండల తహశీల్దార్ సుభాని, ఎస్‌ఐ విఎస్.వీరభద్రరావు, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి, దేవస్థానం మాజీ ఛైర్మన్ పరసా విశ్వేశ్వరరావు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, దేవస్థానం సిబ్బంది, పంచాయతీ, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.