అభినందనీయులు వట్టి వసంతకుమార్‌

Jun 10,2024 21:37

జయంతి వేడుకలో వక్తలు
ప్రజాశక్తి – భీమడోలు
మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ఎంఎల్‌ఎగా ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ అభినందనీయులని, పలువురికి స్ఫూర్తి ప్రదాత అని, ఆయన ఆశయాలు రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, వట్టి వసంత కుమార్‌ అభిమానులు భీమడోలు మండలంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, పాలు, పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య పర్యవేక్షకులు డాక్టర్‌ ఎన్‌.సునీత, మత్తువైద్య నిపుణులు అశ్విని, సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న వసతుల గురించి వారికి వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వైద్యశాల ఆవరణలో మొక్కలను నాటారు. 2008లో ఎంఎల్‌ఎగా వట్టి వసంత్‌ కుమార్‌ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో భీమడోలు సంతపేటలో నిర్మించిన గోదావరి జలాలను అందించే నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది మరమ్మతులకు చేరుకుని నిరుపయోగంగా ఉంది. వట్టి వసంతకుమార్‌ జయంతి పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, వట్టి వసంత కుమార్‌ అభిమానులు సదరు ట్యాంకుకు మరమ్మతు చేసి సోమవారం నుంచి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్ధినీడి వెంకటేశ్వరరావు (సత్య సాయి), తమ్మన రామకృష్ణ, కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

➡️