దెందులూరు : సొంత ఊరుపై, పుట్టి పెరిగిన ఇంటిపై మురళీమోహన్ అభిమానం ఎంతో అభినందనీయమని దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ సినీ నటులు, జయభేరి సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రముఖ భవన నిర్మాణ సంస్థ అయిన జయభేరి సంస్థ అధినేత మాగంటి మురళీమోహన్ తన పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని ఎంతో అభిమానంతో తిరిగి పునర్నిర్మించుకుని తన భావితరాలకు కూడా అందించాలని భావించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాగే జీవితంలో మనం ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడకు వెళ్లినా, కన్న తల్లిని, సొంత ఊరును ఎప్పటికీ మర్చిపోకూడదని, ఎవరు ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా తమ సొంత ఊరుకి, కన్నతల్లికి అండగా నిలిచినప్పుడే వారి జీవితానికి, విజయానికి సార్థకత లభిస్తుందని ఎంఎల్‌ఎ తెలిపారు.
‘పది’ విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ
ప్రజాశక్తి – నూజివీడు టౌన్
మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని శ్రీఅన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ ఎస్‌కె.నజ్మాచే పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్, స్కేల్, పెన్సిల్, రబ్బర్, షార్పనర్ బహుకరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని పి.రాధికారాణి తెలిపారు. అనంతరం డాక్టర్ గౌతమ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. తాను చాలా కష్టపడి చదివానని, డాక్టర్ కావాలి అనే కోరిక చదువుకొనే వయస్సు నుంచే ఉండేదని తెలిపారు. కిందటి సంవత్సరం నుంచి ఇద్దరు డాక్టర్స్ కలసి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంభందించిన మెటీరియల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కౌసిక్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీను, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ భావిశెట్టి వీరయ్య, ఉపాధ్యాయ సిబ్బంది మోహన్ రావు, రవీంద్ర పాల్గొన్నారు.
వాహనదారులు లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలి
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జగదీష్
ప్రజాశక్తి – మండవల్లి
వాహన పత్రాలు అందుబాటులో ఉంచుకొని వాహనాలు నడపాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ స్పష్టం చేశారు. మండలంలోని లోకుమూడి సెంటర్లో మంగళవారం ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను పాటిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. నిబంధనలు పాటించకపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఎత్తున ప్రత్యేక డ్రైవరు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వాహనాలను నడపాలని తెలిపారు. త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా లేని వాహనాలపై కేసును నమోదు చేస్తున్నామని అన్నారు. అనంతరం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను, లైసెన్స్ ఆవశ్యకతను వాహనదారులకు వివరించారు. ఈ తనిఖీలో ఇన్‌స్పెక్టర్ డి.ప్రజ్ఞ పాల్గొన్నారు.
అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ
ప్రజాశక్తి – నూజివీడు టౌన్
నూజివీడు పట్టణంలోని జెడ్‌పి హైస్కూల్ ఆవరణలో అంగన్వాడీలకు మంగళవారం ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఒ కె.ధనలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా అందించే పోషకాహారంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. బాల్యంలో ఉన్న చిన్నారులకు పూర్వ విద్య కథలు, పాటల ద్వారా తెలపాలన్నారు. వివిధ పరికరాలతో చిన్నారులకు ఆటలు నేర్పాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేసేందుకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చిన్నారుల పురోభివృద్ధి, ఆరోగ్యం, బాల్యదశను కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక పరికరాలు దిగుమతి అయినట్లు చెప్పారు. ఈ ఆట వస్తువులను అన్ని అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేశామన్నారు. కొత్తగా వచ్చిన ఆట వస్తువులతో చిన్నారులు ఎంతో ఆనందంగా ఆడుతూ, పాడుతూ కనిపిస్తున్నారని సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా ధనలక్ష్మి, సూపర్వైజర్లు సులోచన, రమాదేవి పాల్గొన్నారు.
నిరంతర కృషితోనే ‘పది’లో ఉత్తమ మార్కులు
ఎస్‌టియు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
దెందులూరు : విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలంటే నిరంతర సాధన, పట్టుదల వల్లే సాధ్యమవుతుందని పెదవేగి మండల విద్యాశాఖ అధికారులు సబ్బిత నరసింహమూర్తి, అరుణ్ కుమార్‌లు చెప్పారు. మంగళవారం పెదవేగి మండలం పెదవేగి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్యాడ్, రెండు బ్లూ పెన్స్, పెన్సిల్, లాంగ్ స్కేల్, వృత్తలేఖిని, పౌచ్, హల్ టికెట్ పౌచ్‌లను పెదవేగి మండల శాఖ తరపున అందించారు. ఈ సందర్బంగా ఎంఇఒ 1, 2లు మాట్లాడు తూ విద్యా సవత్సరమంతా అధ్యాపకులు చక్కని బోధన ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తారని, పరీక్షల సమయంలో బోధనా అంశాలను పున పరిశీలించుకుని, చక్కగా సిద్ధమవడం అనేది విద్యార్థుల చేతిలోనే ఉంటుందన్నారు. ప్రధానంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే ప్రాణాళికాయుతమైన సాధన, కృషి, పట్టుదల అవసరమన్నారు. సర్పంచి శ్రీరామ్ మూర్తి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాత సత్యనారాయణలు, ప్రవీణ్, షఫీ, భూషణం, గుప్తా, రమేష్ పాల్గొన్నారు.