తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
జిల్లాలో అక్రమంగా తొలగించిన విఒఎలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్) ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన విఒఎలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, విఒఎలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నినదించారు. యూనియన్ జిల్లా కోశాధికారి పి.ఆమని అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో విధులు నిర్వర్తిస్తున్న విఒఎలను రాజకీయ వేధింపులకు గురి చేస్తూ, అక్రమంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటూ స్వయంగా అధికార పార్టీ నాయకులే అక్రమంగా విఒఎలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాయకులే నేరుగా వెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించి, గ్రూపుల ఆమోదం తీసుకోకుండా, గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేయకుండా విఒఎలను తొలగించడం దుర్మార్గమ న్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిని మాట్లాడుతూ విఒఎలు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి గ్రామాల్లో అనేక సేవలు అందిస్తున్నారని, అయినా వారిపై కక్ష కట్టి అన్యాయంగా తొలగించడం మానుకోవాలన్నారు. గత ఏడు నెలలుగా వేతనాలు లేక విఒఎలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విఒఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. ధర్నా శిబిరం వద్దకు విచ్చేసిన డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజుకు వినతిపత్రా న్ని అందించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మేరీ, ఆదిలక్ష్మి, పావని, మరియమ్మ, రమాదేవి, వరలక్ష్మి, జగదాంబ, సుజాత, పార్వతి పాల్గొన్నారు.
