ప్రజాశక్తి – బుట్టాయగూడెం
పోలవరం నిర్వాసితులకు స్వచ్ఛమైన తాగునీరందించాలని, పునరావస కాలనీకి శ్మశానవాటిక స్థలం చూపాలని ములగలగూడెం(పెద్దూరు) గ్రామ నిర్వాసితులు కోరారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి బుధవారం వారు వినతిపత్రం అందించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ పాయం రమేష్, ఇఒపిఆర్‌డి ఎం.శ్రీహరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం మండలంలోని కోండ్రుకోట ములగలగూడెం(పెద్దూరు) గ్రామ నిర్వాసితులు మండలంలోని రెడ్డిగణపవరం పంచాయతీ వెలుతురువారి గూడెం వద్ద పునరావాస కాలనీలో 150 కుటుంబాల వారు ఉంటున్నారన్నారు. 2021లో పునరావాస కాలనీకి వచ్చారన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ స్వచ్ఛమైన తాగునీరు లేక బయట కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కాలనీలో ఒక విద్యుత్ మోటార్, మూడు చేతిపంపుల నుంచి సుద్ద నీరు వస్తుందని, అవి తాగితే కాళ్ల నొప్పులు వస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజు రెడ్డిగణపవరం వెళ్లి నీరు కొంటున్నారన్నారు. తాగునీటి కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తాగునీరు అందించాలన్నారు. పునరావాస కాలనీకి ఇప్పటివరకు శ్మశాన వాటిక స్థలం లేదన్నారు. అధికారులు శ్మశాన స్థలం చూసినా భూసేకరణ మాత్రం చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండలాధ్యక్ష, కార్యదర్శులు కారం భాస్కర్, పోలోజు నాగేశ్వరరావు, నిర్వాసితులు ఎస్.విజయరత్నకుమారి, పి.రామారావు, పి.సంకురుదొర, మూలేం శారమ్మ, బి.దేవరాజు, ఎం.పండమ్మ, రాధ, గంగాభవాని పాల్గొన్నారు.