ఎస్‌సి వర్గీకరణ హేయం

ప్రజాశక్తి – ఏలూరు సిటీ

రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణ విషయంలో అన్నదమ్ముల లాంటి తమ మధ్య చిచ్చు రేపుతోందని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని ఇండోర్‌ స్టేడియం వద్ద గల లేడీస్‌ లయన్స్‌ క్లబ్‌లో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఎస్‌సి వర్గీకరణ జరగాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని, రాష్ట్రంలో అధికంగా ఉన్న మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఎస్‌సి సోదరుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని అన్నారు. ఎస్‌సిలందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ముందు ముందు దళితులంతా ఉద్యమబాటా చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత నాయకులు నేతల రమేష్‌, కార్తీక్‌, మొండెం సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి : సిపిఐ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

స్థానిక కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, కొల్లూరి సుధారాణి పాల్గొన్నారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం

నూజివీడు టౌన్‌ : నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వసతుల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల నాయకులు సూచనలు చేయాలని నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్మరణ్‌ రాజ్‌ తెలిపారు. నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో 286 పోలీస్‌ స్టేషన్లు ఉండగా గ్రామీణ ప్రాంతాలలో 1200 మంది ఓటర్లు, పట్టణ ప్రాంతాలలో 1400 మంది ఓటర్లకు మించి ఎక్కడైనా ఉంటే ఆయా పోలీస్‌ స్టేషన్‌ వివరాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా నూజివీడు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌, టిడిపి నాయకులు పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోని బిఎల్‌ఒలను, స్థానిక సచివాలయ సిబ్బందిని నియమించాలని, తద్వారా ఓటర్‌ స్లిప్ల పంపిణీ, ఇతర అంశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పోలింగ్‌ స్టేషన్‌ 176, 121లో గత ఎన్నికల్లో వెంటిలేషన్‌ సరిగా లేకపోవడంతో వృద్ధులు ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని నాయకులు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ డిటీ రవి కిరణ్‌ సింగ్‌, బిజెపి నాయకులు జిఆర్‌కె రంగారావు, బోను అప్పారావు, ముత్యాల కామేష్‌ పాల్గొన్నారు.

23 నుంచి సిపిఐ ప్రచార జాత

ఏలూరు అర్బన్‌ : ఈనెల 23న సర్దార్‌ భగత్‌ సింగ్‌ వర్ధంతి నుంచి ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి వరకు సిపిఐ శత వార్షికోత్సవాలు సందర్భంగా ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం వెంకటాచారి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వనజ మాట్లాడుతూ 2025 డిసెంబర్‌ 26 నాటికి సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సిపిఐ దేశంలోనూ, రాష్ట్రంలోనూ, జిల్లాలో గత 100 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలను సాధించిన విజయాలను, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వివరిస్తూ ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️