అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం..!

చెప్పుల దండ వేసిన ఆగంతకులు
నిరసనగా దళితుల రాస్తారోకో
ప్రజాశక్తి – భీమడోలు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి భీమడోలు మండలంలో ఘోర అవమానం జరిగింది. భీమడోలు మండలం పొలసానిపల్లిలో ద్వారకాతిరుమల రహదారి పక్కన ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి చెప్పుల దండ వేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగు చూడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భీమడోలు సిఐ విల్సన్‌ నేతృత్వంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి పలు ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ, ఎటువంటి ఆగ్రహావేశాలకు లోను కావొద్దని, నిందితులను అధునాతన పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాలు, ఫోన్‌ ట్రాకింగ్‌ సహాయంతో పట్టుకుంటామని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి ఇలాంటి అవమానం బాధాకరమని, దుండగులను తక్షణం అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు.

➡️