రోడ్డుపై వాహనాలువి
నియోగదారుల అవస్థలు
పత్తేబాద రైతుబజార్ వద్ద పరిస్థితి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలకు కేటాయించడంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఏలూరులోని పత్తేబాద రైతు బజార్ వద్ద ఏర్పడింది. మరోపక్క చినుకు పడితే రైతు బజార్‌తో పాటు చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం చిత్తడిగా మారడంతో పాటు దుర్గంధం వ్యాపిస్తూ ఉండటంతో వర్షాకాలంలో వినియోగదారులు రైతుబజార్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.దళారులు, మధ్యవర్తులు లేకుండా రైతులే నేరుగా పండించిన పంటలను వినియోగదారులకు అమ్ముకునే ఉద్దేశంతో 1999లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్లను ప్రారంభించింది. ఏలూరు నగరంలో కూడా పత్తేబాద ప్రాంతంలోని అప్పటి పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో రైతుబజార్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ దీనిని నిర్వహిస్తుంది. ప్రారంభంలో 60 దుకాణాలు ఉండగా ఇప్పుడు 90 దుకాణాలు రైతు బజార్లో ఉన్నాయి. ప్రారంభంలో 55 సెంట్ల స్థలంలో రైతుబజార్ ఏర్పాటు చేయగా తర్వాత కాలంలో మున్సిపాలిటీకి చెందిన 15 సెంట్లు రైతు బజార్‌కు కేటాయించడంతో ప్రస్తుతం 70 సెంట్ల స్థలంలో రైతు బజార్ నిర్వహిస్తున్నారు. 1999లోనే రైతుబజార్ ఏర్పాటు చేసినప్పుడే నాలుగు సెంట్ల స్థలాన్ని ప్రహరీ గోడ బయట రైతుబజార్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. అయితే 2004లో అప్పటి కలెక్టర్ పాలు, పాల ఉత్పత్తులు అమ్మే ఒక డెయిరీకి స్థలం కేటాయించడంతో పార్కింగ్ స్థలంలో ఒక బడ్డీని ఏర్పాటు చేశారు. మూడు, నాలుగేళ్ల క్రితం అప్పటి జాయింట్ కలెక్టర్ సిఫారసుతో మరో కిరాణా దుకాణానికి స్థలం కేటాయించడంతో మరో బడ్డీ ఏర్పాటైంది. ఆ తర్వాత ఎంపీ రికమండేషన్ అంటూ మరో వ్యాపారుడు అధికారికంగా లేఖ తీసుకురావడంతో ఒక టీ దుకాణానికి మళ్లీ స్థలం కేటాయించారు. దీంతో నాలుగు సెంట్లు ఉన్న పార్కింగ్ స్థలంలో ఒక డెయిరీ, ఒక కిరాణా, ఒక టీ దుకాణం ఉండటంతో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం మొత్తం ఆక్రమించినట్లు అయింది. దీంతో రైతు బజారుకు వచ్చిన వినియోగదారులు పార్కింగ్ కోసం స్థలం లేక రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయాల్సి రావటంతో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారడంతో అప్పుడప్పుడు వస్తున్న పోలీసులు రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాలకు చలానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు రైతు బజార్ ముందు రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. మరోపక్క రైతు బజార్ ముందు ఉన్న రోడ్డు డివైడర్ మీద సైతం వ్యాపారులు పండ్లు, కూరగాయలు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. దీంతో 30 అడుగులు ఉండే రోడ్డు పది అడుగులకు కుదించుకుపోయి అక్కడ ట్రాఫిక్ ప్రతిరోజు అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతుబజార్ పార్కింగ్ స్థలంలో ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించి పార్కింగ్ స్థలాన్ని పార్కింగ్ కోసమే వదిలేయాలని, రోడ్డు మీద వ్యాపారాలు చేసే వారికి రైతుబజార్ ఎదురుగా ఉన్న బృందా వన్ పార్క్ వద్ద గ్రీన్ జోన్ ఏర్పాటుచేసి అక్కడ వారి వ్యాపారాలకు స్థలాలు కేటాయించాలని వినియోగదారులు కోరుతున్నారు.ఈ విషయంపై రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్ మాట్లాడుతూ రైతు బజార్ ఆదాయం పెంచేందుకు అవుట్‌లెట్ దుకాణాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారని, అందుకే పార్కింగ్ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కాని నిబంధనల ప్రకారం రైతుబజార్ ఆదాయం పెంచాలంటే అవుట్ లెట్ దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వమే వాటినే నిర్మించి, టెండర్ ప్రక్రియ ద్వారా ఎవరు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తే వారికే దుకాణాలు కేటాయించాల్సి ఉంది. ఒకవేళ దుకాణాలు నిర్మించలేని పరిస్థితి ఉంటే, స్థలాలు కేటాయించాల్సి వస్తే అప్పుడు కూడా స్థలాలను మార్కింగ్ చేసి, టెండర్ నిర్వహించి ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికే స్థలాలు కేటాయించాల్సి ఉంది. అధికారులు చర్యలు తీసుకొని ఈ విషయంలో పరిస్థితిని చక్కదిద్ది వినియోగదారుల కోసం పార్కింగ్ స్థలం కేటాయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.చినుకు పడితే చిత్తడేమరోపక్క కొద్దిపాటి చినుకులు పడితే చాలు రైతు బజార్ ప్రాంతమంతా చిత్తడిగా మారి దుర్గంధంతో నిండిపోతుంది. పెద్ద వర్షం వస్తే రైతు బజార్ మొత్తం నీట మునిగి వినియోగదారులు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. రైతు బజార్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎక్కువమంది వెనుక ఉన్న గేటు ద్వారా లోపలికి వెళ్తూ ఉంటారు. అయితే కొద్దిపాటి వర్షానికి వెనుక వైపు ఉన్న డ్రెయినేజీ మొత్తం పొంగి పొర్లి రోడ్డు మొత్తం బురద మాయంఅవుతుంది. రైతుబజార్‌ను ఆనుకుని శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడ శానిటేషన్ సక్రమంగా నిర్వహించడంలో సిబ్బంది, అధికారులు విఫలమవుతున్నారు. దీనికి పరిష్కారంగా రైతుబజార్ వెనుక ఉన్న రోడ్డును తిరిగి ఎత్తుగా నిర్మించాల్సిన అవసరం ఉంది.విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : జెసినిబంధనలకు విరుద్ధంగా షాపులు కేటాయించడంపై గురువారం రాయితీ కౌంటర్ల ప్రారంభోత్సవానికి రైతుబజార్‌కు విచ్చే సిన జెసి బి.లావణ్యవేణిని వివరణ కోరగా ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
