నూజివీడులో ఇంటర్నల్ స్క్వాడ్ తనిఖీలు
ప్రజాశక్తి – నూజివీడు టౌన్
ఎరువుల డీలర్లందరూ ఇ- పాస్ మిషన్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఎరువులను విక్రయించాలని వ్యవసాయ సహాయ సంచాలకులు కోట రామచంద్రపురం, బుజ్జిబాబు సూచించారు. మండలంలో ఇంటర్నల్ స్క్వాడ్ తనిఖీలను వారు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు మండల ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం బుజ్జిబాబు మాట్లాడుతూ ఎరువుల డీలర్లందరూ ఇ- పాస్ మిషన్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఎరువులను విక్రయించాలన్నారు. ఎరువుల ధరలు స్టాక్ నిల్వలు రైతులకు కనపడే విధంగా ప్రదర్శించాలన్నారు. డీలర్లందరూ ఆధీకృత డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పొందిన స్టాక్‌లను విక్రయించే విధంగా రైతుకు బిల్లు ఇవ్వాలని తెలిపారు. ఎఫ్‌సిఒ 1985 నిబంధనలను అనుసరించి డీలర్లు స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాల నిర్వహణ సక్రమంగా ఉండాలని తెలిపారు. అనంతరం నూజివీడులోని భాస్కర ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణంలో రికార్డులను పరిశీలించి, ఎరువుల గోడౌన్‌లో స్టాక్ నిల్వలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరువుల డీలర్లు, మండల వ్యవసాయాధికారి ఎ.చాముండేశ్వరి పాల్గొన్నారు.
