విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థులకు పలు పోటీలు
ప్రజాశక్తి – నూజివీడు టౌన్
నూజివీడు ఆర్‌జియుకెటిలో ఈ నెల 14, 15 తేదీల్లో సిగస్-25 వార్షిక సాంస్కృతిక మహోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరిగా 2019లో జరిగిన ఈ మహోత్సవం ‘రివైవింగ్ ది టైంలెస్ ట్రెడిషన్స్’ అనే నేపథ్యంతో మళ్లీ 2025లో పున రావ్భివించింది. మరుగున పడిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను మళ్లీ భావితరాలకు తెలియపరచడమే ఈ నేపథ్యం ముఖ్య ఉద్దేశం. సిగస్-25 కేవలం రెండు రోజులకే పరిమితం కాకుండా దాదాపు 15 రోజుల ముందు నుంచే ప్రీ-ఈవెంట్స్ అనే పేరుతో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 24వ తేదీన డైరెక్టర్ అమరేంద్ర కుమార్ ఫ్లైయర్ లాంచ్‌తో సిగస్-25 ప్రీ-ఈవెంట్స్ ప్రారంభించారు. ఎచోస్ ఆఫ్ ద పాస్ట్ అనే పేరుతో డిబేట్ కాంపిటీషన్ రెండు రౌండ్లలో నిర్వహించారు. ఎంతోమంది విద్యార్థులకు వంట చేయడం పట్ల ఆసక్తి ఉండటం వల్ల కిచెన్ క్రానికల్స్ అనే ఆలోచనతో పోటీని నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు వంట చేయడంలో తమ ప్రతిభను కనబరిచారు. ఎంతో ట్రెండ్‌లో ఉన్న స్క్విడ్ గేమ్ అనే వెబ్ సిరీస్‌ను ఆధారంగా తీసుకుని స్క్విడ్ వార్ పోటీ నిర్వహించారు. ఇందులో ఉత్సాహం కలిగించే వివిధ రకాలైన చిన్నప్పటి ఆటలను విద్యార్థుల మధ్యన పోటీలుగా పెట్టారు. వంద మందికే పరిమితమైన ఈ ఆటలో చివరకు ఒక్కరే విజేతగా నిలిచారు. ఇంకా పలు పోటీలను నిర్వహించారు.
