ముదినేపల్లి నుంచే సీతాదేవి ప్రస్థానం

నేడు కొండూరులో అంత్యక్రియలు
ప్రజాశక్తి – ముదినేపల్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ ఎర్నేని సీతాదేవి జీవన, రాజకీయ ప్రస్థానం ముదినేపల్లి నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. గుండెపోటుతో మరణించిన సీతాదేవికి ముదినేపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె పుట్టినిల్లు ముదినేపల్లి మండలం గురజ గ్రామం కావడంతో సీతాదేవికి ఈ ప్రాంతంతోనే ఎక్కువ అనుబంధం ఏర్పడింది. ఆమె కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలం కొండూరు గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ముదినేపల్లి నియోజకవర్గ టిడిపి నాయకులతోనే ఎక్కువగా రాజకీయ సంబంధాలు ఉండేవి. ఉన్నత విద్యావంతురాలు అయిన సీతాదేవికి కొండూరుకు చెందిన సమీప బంధువైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌తో వివాహమైంది. ఎన్‌టిఆర్‌ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో సీతాదేవి రాజకీయ అరంగేట్రం చేశారు. ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో తొలి మహిళ నేతగా సీతాదేవి కాలు మోపారు. తొలిసారిగా సీనియర్‌ రాజకీయవేత్త, కృష్ణా జెడ్‌పి ఛైర్మన్‌గా పని చేసిన కీర్తిశేషులు పిన్నమనేని కోటేశ్వరరావుపై 1983లో టిడిపి తరఫున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోనేరు రంగారావుపై విజయం సాధించి ఎన్‌టిఆర్‌ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి మహిళా ఎంఎల్‌ఎగా సీతాదేవి ఒక్కరే పని చేశారు. ఆమె భర్త ఎర్నేని నాగేంద్రనాథ్‌ మరణించి ఏడాది కాకుండానే సీతాదేవి కన్ను మూయడంతో ముదినేపల్లి మండల ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ముదినేపల్లి అభివృద్ధిలో సీతాదేవి ముద్ర ముదినేపల్లి మండల అభివృద్ధిలో మాజీ మంత్రి సీతాదేవి తనదైన ముద్ర వేశారు. తన పుట్టిన గ్రామం మండలంలోని గురజ కావడంతో ఈ మండలంపై ఆమె ప్రత్యేక ప్రేమను కనబరిచారు. ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా ప్రభుత్వ బాలికల వసతి గృహం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆర్‌టిసి బస్టాండ్‌ నిర్మాణంతోపాటు, ముదినేపల్లి-ఏలూరుపాడు రోడ్డు విస్తరణ, పలు పంట కాలువలు, డ్రెయిన్లపై వంతెనల నిర్మాణం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను ఆమె నిర్వహించారు.సీతాదేవి మృతి టిడిపికి తీరని లోటు మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మృతి టిడిపికి తీరని లోటు అని టిడిపి నియోజకవర్గ కన్వీనర్‌ వీరమల్లు నరసింహారావు, మాజీ ఎంపిపి ఎర్నేని లక్ష్మణ ప్రసాద్‌, నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఛార్జి కొడాలి వినోద్‌ అన్నారు. కొండూరులోని ఆమె నివాసంలో సీతాదేవి భౌతికకాయానికి మంగళవారం నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముదినేపల్లిలో మాట్లాడుతూ పార్టీ పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరమన్నారు. నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్‌, మండల అధ్యక్షులు శోభనాద్రి చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి బొంగు రవికుమార్‌, నాయకులు ఎర్నేని కిషోర్‌, వీరమల్లు సత్యనారాయణ, కొత్తూరి విఠల్‌, బి.సుందరరామయ్య, కె.శేషుబాబు, పరసా ఏడుకొండలు, ఎల్‌.భాను ప్రసాద్‌, ఈడుపుగంటి శ్రీనివాస్‌, దావు నాగరాజు, జాస్తి రాజా, ఎర్ర రాంబాబు, బండి సత్యనారాయణ, ఈడే సుధాకర్‌ ఉన్నారు.
నేడు అంత్యక్రియలు..
         కలిదిండి: మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి (74) అంత్యక్రియలు మండలంలోని కొండూరులో బుధవారం నిర్వహించనున్నారు. ఆమె హైదరాబాదులో సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామమైన మండలంలోని కొండూరు గ్రామానికి మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. నాయకులు కమ్మిలి విఠల్‌, తాడినాడ బాబు, కామినేని శ్రీనివాసరావు, టిడిపి నాయకులు, అభిమానులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతేడాది మరణించిన ఆమె భర్త రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్‌ పుట్టిన రోజు మంగళవారం కావడంతో సీతాదేవి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

➡️