నేటి నేతలకు ఆదర్శనీయులు సీతారాం ఏచూరి

సంస్మరణ సభలో ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి చంటి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
మార్క్సిస్టు ఉద్దండుడు, మేధావి, మాజీ ఎంపీ, సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శనీయుడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం సీతారాం ఏచూరి, రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్‌) సంస్మరణ సభ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన జరిగింది. తొలుత సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ఆర్‌ఎస్‌ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎంఎస్‌.నాగరాజు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాం, చంటి మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఒక గొప్ప రాజకీయ నాయకుడని, దేశ రాజకీయాల గురించి, మతోన్మాదం గురించి, పీడిత ప్రజల కష్టాల గురించి తెలిసిన నాయకుడని కొనియాడారు. కేవలం సిపిఎం, వామపక్ష పార్టీల వారే కాకుండా ఇతర రాజకీయ పార్టీల వారంతా గౌరవించే నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో బిజెపికి వ్యతిరేకంగా యుపిఎ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడంలో ఆయన పాత్ర ప్రముఖమన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఆయన సూచనలను, సలహాలను అంగీకరించేవారని అన్నారు. దేశంలో లౌకికవాదాన్ని బలంగా వినిపించి, మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడినటు వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. జిల్లాలో సీనియర్‌నేత, మాజీ ఎంఎల్‌ఎ రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్‌) సుమారు 70 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో నికరంగా సిపిఎం సిద్ధాంతాలకు కట్టుబడి తుదిశ్వాస వరకు పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఆర్‌ఎస్‌ మతోన్మాదులు, దోపిడీవర్గాల పట్ల కఠినంగాను, తోటి కమ్యూనిస్టులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజల పట్ల అత్యంత ప్రేమతో మెలిగేవారని తెలిపారు. సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్‌ జీవితాలు నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. సభలో సిపిఐ జిల్లా జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎంఎస్‌.నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఒక్క సిపిఎంకే కాకుండా వామపక్షాలకు వేగుచుక్కలా వ్యవహరించారని, ప్రపంచ దేశాల్లో పేరు గడించారని అన్నారు. గతంలో నేపాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటుకు సహకారం అందించారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు, పి.కిషోర్‌, జి.రాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. సభలో టిడిపి నాయకులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నంనాయుడు పాల్గొన్నారు.

➡️