సీలింగ్‌ భూములకుపంట రుణాలు నిలిపివేత

Sep 28,2024 22:39

సహకార సంఘాల్లో రైతులకు ఎదురుదెబ్బ
30 ఏళ్లుగా ఇస్తున్న పంట రుణాల నిలిపివేతపై రైతుల ఆగ్రహం
రెండు జిల్లాల్లో వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరం
సీలింగ్‌ భూములున్న రైతులంతా పేద దళితులు, బిసిలే
సొంతభూమి, పట్టా ఉన్నా పంట రుణం ఇవ్వకపోవడంపై విస్మయం
ఎంఎల్‌ఎలు, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని రైతుల వేడుకోలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
సీలింగ్‌ భూముల రైతులకు సహకార సంఘాల్లో పంటరుణాల మంజూరును నిలిపివేయడం రెండు జిల్లాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. కౌలురైతులకు బ్యాంకుల నుంచి పంటరుణాలు మంజూరు చేయాలని ఆందోళనలు జరుగుతున్న క్రమంలో పట్టాలున్న సీలింగ్‌ భూములకు పంటరుణాలు నిలిపివేత అత్యంత దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటరుణాలు ఇవ్వకపోగా.. గతంలో ఇచ్చిన రుణాలు వెంటనే చెల్లించాలంటూ రైతులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుండటంపై రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. సీలింగ్‌ భూములున్న రైతులంతా ఎస్‌సి, బిసి సామాజిక తరగతులకు చెందినవారే. డిసిసిబి పరిధిలో ఏలూరు జిల్లాలో 159, పశ్చిమగోదావరి జిల్లాలో 122 మొత్తం 281 సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాల ద్వారా జిల్లా రైతాంగానికి ప్రతియేటా పెద్దఎత్తున పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు సీలింగ్‌ భూములిచ్చి దాదాపు 35 ఏళ్లకుపైగా గడిచిపోయింది. అప్పటి నుంచి సీలింగ్‌ భూములకు సహకార సంఘాల్లో పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సీలింగ్‌ భూములకు పంటరుణాలు నిలిపివేస్తూ సాగుచేసే రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మార్చిలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, కొత్త ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం అప్పట్లో పేద కుటుంబాలకు చెందిన దళిత, బిసి సామాజిక తరగతులకు అరెకరం చొప్పున సీలింగ్‌ భూములను పంపిణీ చేసింది. ఆ భూములకు క్రాప్‌లోన్‌ కింద రూ.25 వేలు వరకూ సహకార సంఘాలు ఇస్తున్నాయి. పంటరుణం అనేది సాగుచేసే పంట ఆధారంగా ఇస్తారు. ప్రతియేటా మార్చిలో తీసుకున్న రుణం చెల్లించడం, కొత్తరుణం తీసుకోవడం పరిపాటిగా సాగుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీలింగ్‌ భూములకు సంబంధించిన మార్టిగేజ్‌ (తనఖా ప్రక్రియ) జరగకపోవడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని సహకార సంఘాల అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి కన్పించడం లేదు.పంట రుణం ఇవ్వకపోతే సాగు చేసేదెలా.. సొంత భూమి ఉండి, ఆ, భూమికి పట్టా ఉన్నా రకరకాల కారణాలతో సీలింగ్‌ భూములకు పంటరుణాలు నిలిపివేస్తే రైతులు పెట్టుబడి కోసం ఏం చేయాలనే ప్రశ్నకు ఏ ఒక్కరి వద్దా సమాధానం లేకుండాపోయింది. సహకార సంఘాల్లో పంట రుణాలను నిలిపివేయడంతో సీలింగ్‌ భూముల రైతులు రుణాల కోసం నానా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో సహకార సంఘాల జనరల్‌బాడీలో రైతులు అధికారులను నిలదీస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. సీలింగ్‌ భూముల రైతులకు సహకార సంఘాల్లో వెంటనే పంట రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.30 ఏళ్ల నుంచి ఇస్తూ హఠాత్తుగా పంట రుణం ఆపేశారుపిట్టా వెంకటేష్‌, దళిత రైతు, అడవికొలను, నిడమర్రు మండలం ప్రభుత్వం మా కుటుంబానికి అరెకర భూమి సీలింగ్‌ కింద ఇచ్చింది. అడవికొలను సహకార సంఘంలో గడిచిన 30 ఏళ్లుగా పంటరుణం తీసుకుంటున్నాం. ఈ ఏడాది మార్చిలో పంటరుణం ఆపేశారు. జనరల్‌బాడీలోనూ దీన్ని లేవనెత్తాం. పైస్థాయికి పంపుతామని చెప్పారు. హఠాత్తుగా పంటరుణం నిలిపివేస్తే సాగు ఎలా చేయాలి. ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.బకాయిలు చెల్లించినా రుణాలు ఇవ్వకపోవడం ఏమిటీపీతల దానియేలు, రైతు, అడవికొలను ప్రతియేటా పంట రుణం తీసుకోవడం సకాలంలో చెల్లించడం చేస్తున్నాం. మాకిచ్చిన అరెకర సీలింగ్‌ భూమికి అడవికొలను సహకార సంఘంలో 30 ఏళ్లుగా పంటరుణం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నట్టుగా పంటరుణాలు నిలిపివేస్తే వ్యవసాయం ఏవిధంగా చేయాలి. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి.రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డిక్లరేషన్‌ కాకపోవడంతోనే సమస్యనారా తిలక్‌, సిఇఒ, డిసిసిబి సహకార సంఘాల్లో సీలింగ్‌ భూముల రుణాల మంజూరు సమస్య నా దృష్టికి వచ్చింది. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీలింగ్‌ భూములకు సంబంధించి మార్టిగేజ్‌ కావడం లేదు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డిక్లరేషన్‌ కాకుండా పంట రుణం ఇవ్వడం సాధ్యం కాదు. జిల్లాలో పెద్దసంఖ్యలోనూ సీలింగ్‌ భూముల రైతులు ఉన్నారు. గతంలో ఇచ్చిన మార్టిగేజ్‌ 12 ఏళ్లు దాటకపోతే రుణాలిస్తున్నాం. దాటితే మాత్రం మళ్లీ చేయించాల్సి ఉండటంతో అది పూర్తికాక సమస్య ఏర్పడింది. ఆప్కాబ్‌ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం.

➡️