నిర్వాసితులు తహశీల్దార్ కార్యలయం ఎదుట ధర్నా
ప్రజాశక్తి – వేలేరుపాడు రూరల్
మండలంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మొదటి కాంటూరు లెవెల్‌లోని నిర్వాసితుల సమస్యలపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఐటిడిఎ పిఒ రాముల్‌నాయక్, ఆర్‌అండ్‌ఆర్ అధికారి విచ్చేశారు. ఈ గ్రామసభలో అనేక సమస్యలతో కొన్ని వేల దరఖాస్తులు నిర్వాసితులు పెట్టుకున్నారు. కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా తమ గ్రామాలను కూడా ముంపులో తీసుకోవాలని సుమారు 15 గ్రామాల నిర్వాసితులు అడగగా, ఆర్‌అండ్‌ఆర్ అధికారి ఇది తన పరిధి సమస్య కాదు అని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ మాటకు ఆగ్రహించిన నిర్వాసితులు తహశీల్దార్ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి, పిఒ బయటకు రావాలి, సమాధానం చెప్పాలి అని నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోయి, ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించటం లేదని వాపోయారు. ఎన్ని గ్రామసభలు పెట్టి దరఖాస్తులు పెట్టినా ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో మా బాధలు వర్ణణాతీతమని బాధను వెళ్లగక్కారు. తప్పుడు కాంటూర్ లెక్కల తోటి తమ గ్రామాలను ముంపులో తీసు కోకుండా వదిలేయటం అంటే మమ్మల్ని జలశమాధి చేయడమే అన్నారు. ఏటా రెండు, మూడు సార్లు వచ్చే వరదలు ప్రభుత్వానికి, అధికారులకు కనపడలేదని గుర్తు చేశారు. అరగంట తర్వాత ధర్నా దగ్గరకి పిఒ వచ్చి సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వగా నిర్వాసితులు ధర్నాని విరమించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్, జిల్లా నాయకులు మడివి దుర్గారావు, కారం వెంకట్రావు, ఉదరు కిరణ్, రాంబాబు సిపిఐంల్ మాస్ లైన్ ప్రజా పందా నాయకులు మడివి రంగమ్మ, కుంజా సత్తిబాబు, ఆదివాసీ నాయకులు ఊకె ముత్యాలరావు, మోటుకు రాంబాబు, నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.