పాఠశాల స్థాయి నుండి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
నేటి విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జెడ్‌పి ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఎస్‌పి కె.ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం అభివద్ధి పథంలో పయనిస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని, ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత విద్యార్థుల్లో రేకెత్తినప్పుడే వారు జీవితంలో ముందుకెళ్తారన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ఉత్తమ సేవలందించడం ప్రభుత్వ ప్రాధాన్యతన్నారు. ప్రయోగశాలలో నేర్చుకున్న విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు పేరుకు మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాలలు, క్రీడామైదానాలు, అదనపు తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించానని, తాను చదివిన పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ అందించానన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ రెండు ఉన్నత పాఠశాలలను గుర్తించి, ఒకొక్క పాఠశాలకు రూ.4 లక్షలు విలువ చేసే ప్రయోగ పరికరాలు అంధిస్తున్నానన్నారు. సెల్‌ఫోన్‌లో సామజిక మాధ్యమాలకు బానిస కావొద్దన్నారు. జెడ్‌పి ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంపొందించేలా రూ.2 కోట్లతో ప్రయోగ పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. జిల్లా పరిషత్ ద్వారా రూ.50 లక్షలతో విజయకేతనం పుస్తకాన్ని విద్యార్థులకు అందించామని, వీటి వినియోగంతో పాఠశాలల్లో ఉతీర్ణతా శాతం పెరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ క్లాస్‌రూమ్‌లో విన్న పాఠాలతోపాటు ప్రయోగాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ఏ రంగంలో అభిరుచి ఉందో తెలుసుకుని, ఆ రంగంలో వారికి ఉత్తమ విద్యను అందించి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జిల్లా ఎస్‌పి కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయి లక్ష్యాలను నిర్దేశించుకునేలా ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపర్చాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇంటర్మీడియట్‌లో హెచ్‌ఇసి, సిఇసి కోర్సులను ప్రవేశపెట్టాలని, అదేవిధంగా క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రయోగశాలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన షేక్ షాజితా, ఎమ్‌డి.మొబినాలను దుశ్శాలువాతో ఎంపీ సత్కరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు అంతా కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జెడ్‌పి ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఎస్‌పి కె.ప్రతాప్ శివకిషోర్‌లను దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డిఇఒ వెంకట లక్ష్మమ్మ, సర్వశిక్షాభియాన్ ఎపిసి పద్మకుమార్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్.పెదబాబు, స్థానిక కార్పొరేటర్ టి.అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్‌కుమార్, పూజారి నిరంజన్ పాల్గొన్నారు.
